Champions Trophy | ఐసీసీ చాంపియన్ ట్రోఫీ పాకిస్థాన్‌లో ఈ నెల 19 నుంచి మొదలుకానున్నది. టీమిండియా తన మ్యాచులన్నీ దుబాయి వేదికగా ఆడనున్నది. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తొలి మ్యాచ్‌ను 20న బంగ్లాదేశ్‌తో ఆడనున్నది. మెగా ఈవెంట్‌కు ముందు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వేసిన బంతిని పంత్ భారీ షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే, బంతిని ఎడమ మోకాలిని తాగింది. దాంతో పంత్ నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో కమలేష్ జైన్ ప్రాథమిక చికిత్స అందించాడు. ఆ తర్వాత గాయం పరిస్థితిని అంచనా వేసేందుకు నెట్స్ నుంచి బయటకు తీసుకువచ్చారు. మొదటల్లో కాస్త నొప్పి ఎక్కువగానే ఉన్నా.. గాయం అంత తీవ్రంగా ఏమీ లేదని తెలుస్తుంది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ పంత్ ప్యాడ్స్ ధరించి ప్రాక్టీస్ కోసం నెట్స్‌లో చేరాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి నెట్స్‌కు చేరుకొని.. అక్షర్ పటేల్‌తో సరదాగా కనిపించాడు. పంత్ తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరఫున బరిలోకి దిగబోతున్నాడు.
చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మ్యాచులన్నీ దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడుతుంది. 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో ఆడుతుంది. గ్రూప్-ఏ, గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీస్‌కు వెళ్తాయి. ఇదిలా ఉండగా టీమిండియా ఇప్పటి వరకు రెండుసార్లు చాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. 2002లో శ్రీలంకతో సంయుక్త విజేతగా నిలిచింది. 2013లో భారతదేశం ఐదు పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఇదిలా ఉండగా.. చాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయి చేరిన ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. కటక్‌లో ఇంగ్లాండ్‌పై సెంచరీ చేసిన కెప్టెన్ రోహిత్, చివరి మ్యాచ్‌లో అర్ధ సెంచరీతో రాణించిన విరాట్ కోహ్లీ మంచి మూడ్‌లో కనిపించారు. బ్యాట్స్‌మెన్ నెట్ ప్రాక్టీస్ సమయంలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, పంత్‌తో ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ప్రాక్టీస్ చేయించాడు. మహమ్మద్ షమీ బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్‌తో ఎక్కువ సమయం గడిపాడు.
Rishabh Pant got hit on his knees 👀
– hope this is not serious 🙏 pic.twitter.com/Nz4e93Jf1b
— Nikhil (@TheCric8Boy) February 16, 2025