Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ప్రదర్శన చెత్తగా ఉన్నది. గ్రూప్‌దశలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో, రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైంది. సెమీస్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక చర్యలు చేపట్టబోతున్నది. తాత్కాలిక కోచ్ అకిబ్ జావేద్ నేతృత్వంలోని సహాయక సిబ్బందిని తొలగించనున్నట్లు తెలుస్తున్నది. టోర్నీ తర్వాత బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని పీసీబీ వర్గాలు తెలిపాయి. టోర్నీ తర్వాత అకిబ్ జావేద్‌ను సైతం బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. చాంపియన్స్ ట్రోఫీలో జట్టు ప్రదర్శన విషయంలో పీసీబీ తీవ్రంగా నిరాశతో పాటు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
పరిమిత ఓవర్ల క్రికెట్, టెస్టు క్రికెట్ కోసం ప్రత్యేక కోచ్‌లను తీసుకోవాలా? ఒకే కోచ్‌ను తీసుకోవాలా? అన్నదానిపై బోర్డు నిర్ణయం తీసుకోంది. ప్రస్తుతం కోచింగ్ స్టాఫ్‌ను తొలగించడం ఖాయమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది నుంచి బోర్డు కోచ్, సెలెక్టర్లను మార్చిన విధానం నేపథ్యంలో.. ఆయా పోస్టుల్లో మరొకరిని నియమించడం సవాల్‌తో కూడుకున్నదే. గ్యారీ కిరిస్టెన్ వైదొలిగిన తర్వాత గతేడాది పరిమితి ఓవర్ల జట్టుకు తాత్కాలిక కోచ్‌గా అకిబ్‌ను పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నియమించారు. ఆ తర్వాత టెస్టు కోచ్ జాసన్ గిల్లెస్పీ తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆకిబ్‌కు దక్షిణాఫ్రికార, వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు సైతం కోచ్ బాధ్యతలు అప్పగించారు.
మార్చి 16 నుంచి ఏప్రిల్ 5 మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేల కోసం పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించనున్నది. ఈ నేపథ్యంలో బోర్డు త్వరలోనే శాశ్వత కోచ్‌ను నియమించే అవకాశాలున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహాల నేపథ్యంలో పీసీబీ శాశ్వత కోచ్ నియామకంపై దృష్టి పెట్టలేకపోయింది. తాజాగా కోచ్ నియామకానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. గ్యారీ కిరిస్టెన్, గిల్లెస్పీ రాజీనామా చేసిన విధానాన్ని బట్టి.. పీసీబీ విదేశీ కోచ్‌పై ఆలోచించడం లేదని.. ఆ బాధ్యతలను స్వీకరించే విశ్వాసపాత్రుడైన మాజీ క్రికెటర్ కోసం పీసీబీ వెతుకుతున్నది. ఐసీసీ ఈవెంట్ ముగిసిన తర్వాత పీసీబీ చైర్మన్ బోర్డ్ మీటింగ్ నిర్వహించి.. సెలక్షన్ కమిటీని కొనసాగించాలా.. లేదా? నిర్ణయం తీసుకుంటారని సంబంధిత వర్గాలు వివరించాయి.