Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా గురువారం భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా చూపించిన లోగోలో పాకిస్తాన్ పేరు లోగోలో లేకపోవడంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, తప్పును అంగీకరించిన ఐసీసీ.. రాబోయే మ్యాచ్ల సమయంలో పాకిస్థాన్ పేరుతో మూడులైన్ల లోగోను ఉపయోగించేలా చూస్తామని హామీ ఇచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ నిరాకరించింది.
ఈ క్రమంలో హైబ్రిడ్ మోడల్లో దుబాయి వేదికగా ఆడుతున్నది. దుబాయి వేదికగా జరిగిన భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంలో లోగోలో పాక్ పేరు లేకపోవడంపై ఐసీసీకి పీసీబీ లేఖ రాసినట్లుగా ఐసీసీ వర్గాలు ధ్రువీకరించాయి. దుబాయిలో జరిగే అన్ని మ్యాచుల్లో పాకిస్తాన్ పేరు ఉండేలా.. మూడు లైన్ల లోగోను ఉపయోగిస్తామని ఐసీసీ హామీ ఇచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రసారంలో ఎగువ ఎడమ వైపున ఉన్న లోగోపై ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మాత్రమే కనిపించింది. ఆతిథ్య పాకిస్తాన్ పేరు మాత్రం కనిపించలేదు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయి వేదికగా ఆదివారం (ఫిబ్రవరి 23) భారత్-పాక్, మార్చి 2న భారత్ – న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగనున్నది.