Champions Trophy | ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఈ ఏడాది పాకిస్థాన్ వేదికగా జరునున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు ప్రారంభం కానుండగా.. 16న ప్రారంభోత్స వేడుకలు అట్టహాసంగా జరుగనున్నాయి. టీమిండియా మ్యాచులు దుబాయిలో ఆడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఐసీసీ ఈవెంట్ పాకిస్థాన్‌లో జరుగుతుండడంతో.. స్టేడియాలను పునరుద్ధరిస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీ మొదలయ్యే నాటికి స్టేడియాల పునరుద్ధరణ పనులు పూర్తవడం కష్టంగానే తెలుస్తున్నది. గడువుకు ముందే పనులు పూర్తి చేయడం అసాధ్యమని పాక్ మీడియా పేర్కొంది.
కరాచీ, లాహోర్, రావల్పిండి చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాక్‌కు చెందిన ‘డాన్’ పత్రిక గడువులోగా స్టేడియాలు సిద్ధమయ్యేందుకు ఛాన్స్ లేదని పేర్కొంది. అదే సమయంలో సోషల్ మీడియాలో స్టేడియాల పనులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టేడియాలను పునరుద్ధరిస్తామని పీసీబీ పేర్కొంది. ప్రాథమిక సౌకర్యాలు సైతం సకాలంలో సిద్ధం చేయడం కూడా సవాల్‌గా కనిపిస్తున్నది. జనవరి 31 నాటికి స్టేడియాల పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని పీసీబీ బోర్డు ప్రకటించింది. ప్రస్తుతం ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపించడం లేదు. అయితే, సిబ్బంది మాత్రం పనులన్నీ పూర్తి చేసి గడువులోగా అప్పగిస్తామని విశ్వాసం వ్యక్తం చేసినట్లు డాన్ పేర్కొంది.