Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనున్న విషయం తెలిసిందే. సన్నాహకాలను సమీక్షించేందుకు ఐసీసీ ప్రతినిధి బృందం ఈ నెలలో పాక్‌లో పర్యటించనున్నది. అయితే, ఇక టోర్నీలో భారత్ పాల్గొంటుందా? లేదా? అన్న అనిశ్చితి నెలకొన్నది. ఈ క్రమంలో ఐసీసీ ప్రతినిధి బృందం పాక్‌కు చేరుకొని పీసీబీతో టోర్నమెంట్ షెడ్యూల్‌పై చర్చించనున్నది. ఎంత మంది అధికారులు వస్తున్నారు అనేదానిపై సమాచారం ఇవ్వలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పీసీబీ కొంతకాలం కిందట తాతాల్కిక షెడ్యూల్‌ని పంపింది. ఇందులో భారత జట్టును లాహోర్ బస కల్పించనున్నట్లు పేర్కొంది.
పాక్‌లో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా? అనేదానిపై తుది నిర్ణయం తీసుకోకపోవడం షెడ్యూల్ ఖరారు కాకపోవడానికి ప్రధాన కారణం. ఐసీసీ ప్రతినిధి బృందం కరాచీ, లాహోర్, రావల్పిండిలో ఛాంపియన్స్ ట్రోఫీ వేదికల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను తనిఖీ చేస్తుంది. భద్రతా అధికారులతోనూ సమావేశం నిర్వహిస్తున్నది. ప్రసార ఏర్పాట్లు, జట్టు హోటల్స్, ప్రయాణ షెడ్యూల్స్‌ని సమీక్షిస్తుంది. డిసెంబర్ ఒకటి నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సెక్రటరీ జైషా ఐసీసీ చైర్మన్ నియామకమయ్యారు. గతేడాది భారత్‌లో జరిగిన ప్రపంచకప్ మాదిరిగానే ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఆలస్యంగా విడుదల చేయబడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.