Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీ నుంచి పాకిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఇంటా బయట ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజా భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సైతం స్పందించారు. భారత బీ జట్టును ఓడించేందుకు సైతం పాకిస్తాన్ కష్టపడాల్సిందేనని గవాస్కర్ పేర్కొన్నారు. దుబాయి వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పాకిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్తాన్ తొలుత న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత టీమిండియా చేతిలో చావుదెబ్బ తిన్నది.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను న్యూజిలాండ్ ఓడించింది. దాంతో పాకిస్తాన్ సెమీస్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. టోర్నీలో ఇప్పటి వరకు పాక్ ఆడిన రెండు మ్యాచులు గెలువలేకపోయింది. ఇక చివరి గ్రూప్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో తలపడనున్నది. 1996 తర్వాత పాకిస్తాన్ తొలిసారి ఐసీసీ టోర్నీ జరుగుతుండగా.. ఒక్క మ్యాచ్ గెలువలేకపోయింది. పాక్ 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగినా.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ పాక్‌కు భారత బీ జట్టు గట్టి పోటీ ఇస్తుందన్నారు. కానీ, పాక్ ఫామ్‌ను చూస్తే టీమిండియా బీ జట్టును ఓడించడం కూడా కష్టమేనన్నారు.
పాక్‌లో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారని.. టెక్నిక్ బాగా లేకపోయినా.. బ్యాట్, బంతిపై అవగాహన ఉందని చెప్పారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL), దేశీయ పరిమిత ఓవర్ల టోర్నమెంట్లు ఉన్నప్పటికీ.. పాకిస్తాన్ బెస్ట్ ఆటగాళ్ల కోసం ఇబ్బంది పడుతోందని గవాస్కర్ చెప్పారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ యువ ఆటగాళ్లను ఐపీఎల్‌తో సిద్ధం చేసిందని.. ఐపీఎల్ ఆటగాళ్లు రంజీలు, భారత్ కోసం ఆడుతున్నారన్నారు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ విశ్లేషించుకోవాలని సూచించారు. బెంచ్ ఎందుకు బలంగా లేదో చూసుకోవాలన్నారు.