హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో జూనియర్, సీనియర్ జట్ల ఎంపికలో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆలస్యంగా స్పందించడం శోచనీయమని తెలంగాణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(టీడీసీఏ) అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. హెచ్‌సీఏలో ఏండ్లుగా జరుగుతున్న అవినీతిపై కేంద్ర మంత్రి హోదాలో సంజయ్.. సీబీఐ విచారణ చేయించాలని అల్లీపురం డిమాండ్ చేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతి కారణంగా ప్రతిభ కల్గిన క్రికెటర్లకు రంజీ జట్టులో చోటు దక్కడం లేదు. ప్రతిభ లేకపోయినా..ఆర్థికంగా పలుకుబడి ఉన్న వాళ్లు జట్టులో బెర్తులు కొనుకొంటున్నారు. జిల్లాలకు పది క్లబ్‌లే ఉండటంతో గ్రామీణ క్రికెటర్లకు తీరని అన్యాయం జరుగతున్నది. టీడీసీఏకు బీసీసీఐ గుర్తింపు కోసం మంత్రి సంజయ్ కేంద్ర స్థాయిలో కృషి చేయాలి’ అని అల్లీపురం కోరారు.