WTC 2025 : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు మరో రెండు నెలల సమయమే ఉంది. రెండేళ్ల క్రితం విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మరోమారు టెస్టు గద(Test Mace)ను ఒడిసిపట్టాలనే కసితో ఉంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీ సన్నద్ధతలో ఉన్న మాజీ ఛాంపియన్‌కు గుడ్ న్యూస్. లార్డ్స్‌లో జరిగే ఫైనల్ పోరుకు ఇద్దరు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశముంది. పేస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green), స్టార్ స్పిన్నర్ నాథన్ లియాన్ (Nathan Lyon)లు త్వరలోనే జట్టుతో కలుస్తారని సమాచారం.
వెన్నుపాముకు సర్జరీ చేయించుకున్న గ్రీన్ తాను వేగంగా కోలుకుంటున్నాడు. ఈమధ్యే అతడు ఆస్పత్రి బెడ్ మీద నవ్వుతూ దిగిన ఫొటోను, ఆ తర్వాత ఫిట్‌గా మారిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘నేను ఫిట్‌గానే ఉన్నా. త్వరలోనే ఇంగ్లండ్ కౌంటీ క్లబ్.. గ్లౌకోసెస్టర్షైర్ తరఫున మైదానంలో అడుగు పెట్టనున్నాను. ఒకవేళ వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ చేరితే.. ఆ మ్యాచ్‌లో ఆడేందుకు సిద్దంగా ఉన్నాను’ అని వెల్లడించాడు గ్రీన్.
🏏🚨 Big Boost for Australia ahead of the WTC final as Cameron Green and Nathan Lyon set to return after fully recovering from injuries. #Cricket pic.twitter.com/wO1V2UDsGp
— Ramzy 🇬🇧🇵🇰 (@Ramz_004) March 31, 2025
తొడకండరాల గాయం నుంచి కోలుకుంటున్న నాథన్ లియన్ సైతం త్వరలోనే ఫామ్ చాటుకోనున్నాడు. అతడు కూడా స్వదేశంలో జరుగుతున్న షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడే అవకాశం ఉందని టాక్. అదే జరిగితే.. వీళ్లిద్దరూ డబ్ల్యూటీసీ ఫైనల్ కల్లా జట్టుతో కలిసే అవకాశముంది.
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో డబ్ల్యూటీసీ మూడో సీజన్ ఫైనల్ నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 11వ తేదీ నుంచి 15 వరకు జరిగే టైటిల్ పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. రెండేళ్ల క్రితం టీమిండియాకు షాకిచ్చి టెస్టు గదను సొంతం చేసుకున్న కంగారు జట్టు.. రెండోసారి కూడా విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని సఫారీలు.. ఈ అవకాశాన్ని జారవిడవకూడదని భావిస్తున్నారు.