న్యూఢిల్లీ: బ్యాంకు అప్పులు తీర్చేందుకు ఒక వ్యక్తి సొంత ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. (Man Stages Burglary At Own House ) ఇంట్లోని బంగారు నగలు, డబ్బు అపహరించాడు. తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు దొంగ అతడేనని గుర్తించి అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉత్తమ్ నగర్లో నివసించే బుట్టా సింగ్, ఏసీ టెక్నీషియన్. 2022లో ఒక షాపు కొనుగోలు కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. దాని పునరుద్ధరణ కోసం మరో లోన్ తీసుకున్నాడు. అలాగే బ్యాంకు నుంచి అప్పు తీసుకుని సెవెన్ సీటర్ టాక్సీని కొనుగోలు చేశాడు. దీంతో ఈ అప్పుల వల్ల తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు.
కాగా, మార్చి 21న తన ఇంట్లో దొంగతనం జరిగిందని స్థానిక పోలీసులకు బుట్టా సింగ్ ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఉన్న బంగారు నెక్లెస్ సెట్, బంగారు మంగళసూత్రం, రెండు బంగారు ఉంగరాలు, బంగారు గొలుసు, రూ.45 వేల నగదును దొంగలు చోరీ చేసినట్లు ఆరోపించాడు. భార్య సరుకుల కోసం బయటకు వెళ్లినప్పుడు, పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులకు చెప్పాడు.
మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బుట్టా సింగ్ ఇంట్లోకి ఎవరూ చొరబడలేదని గ్రహించారు. అయితే అతడే తన ఇంట్లోకి వెళ్లి 9 నిమిషాల్లో బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. అతడి మొబైల్ ఫోన్లో బ్యాంకు అప్పుల మెసేజ్‌లను పరిశీలించారు.
కాగా, బుట్టా సింగ్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నాడు. దీంతో గోల్డ్ చెన్, గోల్డ్ రింగ్స్‌ను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మిగతా బంగారు వస్తువులను తనఖా పెట్టినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ వ్యక్తిపై గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని పోలీస్ అధికారి వెల్లడించారు.