Jasprit Bumrah : 2024 ఏడాదికి గాను ‘ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ (ICC Test Cricketer of the Year)’ నామినేషన్లలో భారత బౌలింగ్ దిగ్గజం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కు చోటు దక్కింది. ఇంగ్లండ్‌కు చెందిన బ్యాటర్లు జోయ్ రూట్ (Joe Root ), హ్యారీ బ్రూక్ (Harry Brook).. శ్రీలంకకు చెందిన కామిందు మెండిస్లతోపాటు బుమ్రా కూడా ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఉన్నాడు.
బుమ్రా 2024లో 13 టెస్టు మ్యాచ్‌లు ఆడి 14.92 సగటు, 30.16 స్ట్రైక్ రేట్‌తో 71 వికెట్లు పడగొట్టాడు. దాంతో టెస్టు క్రికెట్ చరిత్రలో మరే బౌలర్ సాధించలేని ఘనత సాధించాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య కొనసాగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. కేవలం 4 టెస్టు మ్యాచ్‌లలో 30 వికెట్లు తీసి బెస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. 2023లో బ్యాక్ పెయిన్ నుంచి కోలుకుని వచ్చిన తర్వాత బుమ్రా వదిలే బంతుల్లో పదును పెరిగింది.
ఇక ఇంగ్లండ్ బ్యాటర్ రూట్ 2024లో 17 టెస్టులు ఆడి 55.57 సగటుతో ఏకంగా 1,556 పరుగులు సాధించాడు. రూట్ ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యికి పైగా పరుగులు రాబట్టడం ఇది ఐదోసారి. ఈ ఏడాది అతను రెండో అత్యధిక స్కోర్ సాధించాడు. అంతకుముందు 2021లో రూట్.. 1,708 పరుగుల స్కోర్ చేశాడు. ఇంగ్లండ్‌కే చెందిన మరో బ్యాటర్బ్రూక్ కూడా ఈ ఏడాది 12 టెస్టుల్లో 1,100 పరుగులు చేసి నామినేషన్లలో చోటు సంపాదించాడు.
బ్రూక్ 2024లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. రూట్ అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో యశస్వి జైస్వాల్, బెన్ డుకాటీ ఉన్నారు. బ్రూక్ 2024లో ఒక మ్యాచ్‌లో 322 బంతులను ఎదుర్కొని 317 పరగులు సాధించాడని, అది ఒక అద్భుతమైన ప్రదర్శన అని ఐసీసీ ప్రశంసించింది. ఆ తర్వాత ఏడాదిలో కేవలం 9 టెస్టులు మాత్రమే ఆడి ఏకంగా 74.92 సగటుతో 1,049 పరుగులు సాధించిన శ్రీలంక బ్యాటర్ కామిందు మెండిస్‌కు కూడా ఈ ఐసీసీ అవార్డు నామినేషన్లలో చోటు దక్కింది.