IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఓటములతో సతమతం అవుతున్న ముంబై ఇండియన్స్(Mumbai Indins) అభిమానులకు తీపి కబురు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఆదివారం జట్టుతో కలిశాడు. ఈ విషయాన్ని ముంబై ఫ్రాంచైజీ వెల్లడించింది. ‘సింహం వచ్చేసింది. రాజుగా మళ్లీ తన సామ్రాజ్యాన్ని పాలించేందుకు సిద్ధంగా ఉంది’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టింది. దాంతో, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై మళ్లీ జోరు కొనసాగించడం పక్కా అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. దాంతో, ఈ పేస్ గన్ రాక కోసం యాజమాన్యం, అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఈ క్రమంలోనే కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ మహేల జయవర్ధనేలు బుమ్రా కమ్ బ్యాక్ గురించి హింట్ ఇచ్చారు.
The King of the jungle is back in his kingdom 🦁🔥#MumbaiIndians #PlayLikeMumbai pic.twitter.com/oZMIiSiEm5
— Mumbai Indians (@mipaltan) April 6, 2025
గాయం నుంచి కోలుకున్నాడని త్వరలోనే జట్టుతో కలుస్తాడని మీడియాతో చెప్పారు. అనుకున్నట్టే నేషనల్ క్రికెట్ అకాడమీ అతడికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడంతో ముంబై స్క్వాడ్‌తో కలిశాడు. ఏప్రిల్ 7న వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఈ యార్కర్ కింగ్ బరిలోకి దిగే అవకాశముంది.
ఆనవాయితీ ప్రకారం వరుసగా 13వ సీజన్‌ను ముంబై ఇండియన్స్ ఓటమితో ఆరంభించింది. తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత విజయంతో ఖాతా తెరిచినా.. మళ్లీ పరాజయం మూటగట్టుకుంది. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్ వంటి సీనియర్లు ఉన్నప్పటికీ.. అనుభవజ్ఞుడైన బుమ్రా లేకపోవడంతో ముంబై బౌలింగ్ పదను తగ్గింది. పవర్ ప్లేలోనే వికెట్లు తీసి శుభారంభం ఇచ్చే ఈ యార్కర్ కింగ్ రాకతో ముంబై టీమ్ మరింత పటిష్టంగా మారనుంది.