Kishan Reddy | బడంగ్ పేట్, ఏప్రిల్ 6: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడలో బీజేపీ అధ్యక్షులు రామిడి వీరకర్ణ రెడ్డి, రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు తుళ్ళ వీరేందర్ గౌడ్, అందెల శ్రీరాములు యాదవ్ తదితరులు హాజరయ్యారు. బీజేపీ జెండాను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దరిద్రమైన పాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో బిల్డర్లను అడిగితే తెలుస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బ తిన్నదన్నారు. కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయ రహదారులను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఆర్టికల్ 373ని రద్దు చేయడం జరిగిందన్నారు. రామ మందిరాన్ని నిర్మించి ప్రజల మన్ననలను పొందగలగడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పాలన అంతం చేయాలన్నారు.