Arrest : కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లో దారుణం జరిగింది. తన దగ్గర శిక్షణ పొందేందుకు వచ్చిన 16 ఏళ్ల బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ (Badmintan Coach) అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అమ్మమ్మ ఫోన్లో ఫొటో చూసి ఆమెను నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన బాలిక సెలవుల్లో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ ఓ కోచ్ దగ్గర బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందుతోంది. ఈ క్రమంలో ఓ రోజు బాలిక తన అమ్మమ్మ ఫోన్లోంచి తన నగ్న ఫొటోలకు కోచ్‌కు పంపింది. ఇది గమనించిన అమ్మమ్మ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వాళ్లు నిలదీయడంతో విషయం చెప్పింది.
కోచ్ తనను పలుమార్లు తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని, తాను చెప్పినట్టు వింటే అదనపు కోచింగ్ ఇస్తానని చెప్పాడని తెలిపింది. విషయం బయటికి చెప్పొద్దని బెదిరించాడని చెప్పింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్యాడ్మింటన్ కోచ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కోచ్ తన నేరం ఒప్పుకున్నాడు.