న్యూఢిల్లీ: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న మహిళ, కాబోయే భర్తతో కలిసి అమ్యూజ్మెంట్ పార్క్‌కు వెళ్లింది. వారిద్దరూ కలిసి రోలర్ కోస్టర్ ఎక్కారు. అక్కడ జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది. (Woman Dies In Roller Coaster Accident) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. చాణక్యపురిలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న 24 ఏళ్ల ప్రియాంక ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నది. 2023 జనవరిలో నజఫ్‌గఢ్‌కు చెందిన నిఖిల్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. అయితే ఆర్థికంగా స్థిరపడేందుకు ఈ జంట పెళ్లిని వాయిదా వేశారు. 2026 ఫిబ్రవరిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించారు.
కాగా, ఏప్రిల్ 3న ప్రియాంక తన కాబోయే భర్త నిఖిల్‌తో కలిసి ఢిల్లీ శివారులోని ఫన్ ఎన్ ఫుడ్ వాటర్ పార్క్‌కు వెళ్లింది. వీరిద్దరూ కలిసి రోలర్ కోస్టర్ ఎక్కారు. అయితే అది ఎత్తులో ఉండగా ప్రియాంక కూర్చొన్న చోట పట్టుకునే రాడ్ విరిగిపోయింది. దీంతో రోలర్ కోస్టర్ పైనుంచి ఆమె కిందపడింది. తీవ్రంగా గాయపడిన ప్రియాంకను నిఖిల్ వెంటనే హాస్పిటల్‌కు తరలించాడు. అయితే చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ హాస్పిటల్‌కు చేరుకున్నారు. ప్రియాంక మృతదేహాన్ని పరిశీలించారు. మెడికల్ రిపోర్ట్‌లను సేకరించారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించారు. అమ్యూజ్మెంట్ పార్క్ యాజమాన్యం నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.