Buchi babu Tournament | కొయంబత్తూరు: దేశవాళీ సీజన్ ప్రారంభానికి సూచికగా మంగళవారం నుంచి మొదలవుతున్న బుచ్చిబాబు పోరులో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు సూర్యకుమార్‌యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్‌ఖాన్ బరిలోకి దిగుతున్నారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఎలెవన్‌తో జరిగే పోరులో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించనున్న వీరిపై అందరి దృష్టి నెలకొన్నది. రానున్న బిజీ సీజన్ దృష్టిలో పెట్టుకుని జాతీయ జట్టులో చోటు ఆశిస్తున్న ఈ ముగ్గురు బుచ్చిబాబు పోరులో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నారు. గాయం కారణంగా టెస్టు జట్టుకు దూరమైన అయ్యర్ తిరిగి ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, సూర్యకుమార్, సర్ఫరాజ్ అదే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు 14 టెస్టులాడిన అయ్యర్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. గతేడాది జనవరి నుంచి 12 ఇన్నింగ్స్‌లో అయ్యర్ 17 సగటుతో 187 పరుగులకే పరిమితమయ్యాడు. ఇందులో 35 అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇటీవలే టీ20 కెప్టెన్‌గా ఎంపికైన సూర్యకుమార్..టీమ్ఇండియా తరఫున గతేడాది ఏకైక టెస్టు ఆడాడు.
మరోవైపు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన ముంబై కెప్టెన్ సర్ఫరాజ్ జాతీయ జట్టులో తన చోటు నిలుపుకోవాలని చూస్తున్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లో 50 సగటుతో సర్ఫరాజ్ 200 పరుగులు చేశాడు. మంగళవారం తమినాడుతో జరిగే మ్యాచ్‌లో ముంబై జట్టును సర్ఫరాజ్ ముందుండి నడిపించనున్నాడు. మరోవైపు గత రంజీ సీజన్లో అత్యధిక వికెట్లతో ఆకట్టుకున్న సాయికిషోర్..తమిళనాడు జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే బుచ్చిబాబు టోర్నీతో పాటు వచ్చే నెల 5 నుంచి మొదలవుతున్న దులీప్ ట్రోఫీకి రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ, రిషబ్ పంత్, బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. వచ్చే నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో మొదలయ్యే టెస్టు సిరీస్ నాటికి ఈ స్టార్ క్రికెటర్లు జాతీయ జట్టుతో చేరనున్నారు. బంగ్లాతో సిరీస్ నుంచి టీమ్ఇండియా వరుస సిరీస్‌లతో బిజీగా గడపనుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు ముగిసిన తర్వాత 20 రోజుల వ్యవధిలో ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. రానున్న సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ బలమైన రిజర్వ్ బెంచ్‌ను సిద్ధంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నది.