Andy Brown : భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రాంచీ(Ranchi)లో నాలుగో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. మూడో రోజు టీమిండియా పట్టుబిగించగా.. యువ స్పిన్నర్ల విజృంభణతో నాలుగో రోజు ఇంగ్లండ్ అనూహ్యంగా పోటీలోకి వచ్చింది. చూస్తుంటే.. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లను విజయం ఊరిస్తోంది. ఇరు దేశాల అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తున్నఈ మ్యాచ్‌ను ఓ చిత్రకారుడు బొమ్మగా వేశాడు. నాలుగో రోజు లైవ్ మ్యాచ్‌ను ఇంగ్లండ్‌కు చెందిన ఆండీ బ్రౌన్(Andy Brown ) కాన్వాస్‌పై చిత్రంగా మలిచాడు.
రాంచీ స్టేడియంతో పాటు బౌలర్ బంతి విసరడం, బ్యాటర్, ఫీల్డర్లు సిద్ధంగా ఉన్న దృశ్యాన్ని అచ్చుగుద్దినట్టు ఆవిష్కరించాడు. అతడి ప్రత్యేక నైపుణ్యం చూసిన స్టేడియంలోని ప్రేక్షకులంతా ‘ఏమన్నా టాలెంటా?’ అంటూ నోరెళ్లబెడుతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) 4 వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచిన దృశ్యాన్ని కూడా ఆండీ కాన్వాస్‌పై కళ్లకు కట్టాడు.
అంతేకాదండోయ్.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన తొలి టెస్టు లైవ్‌ను కూడా ఆండీ బొమ్మగా వేశాడు. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లను బొమ్మగా వేయడం ఇదే మొదటిసారి కాదు. పలుమార్లు అతడు తన స్పెషల్ టాలెంట్‌తో అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేశాడు.