Boxing Legend Death : బాక్సింగ్ రింగ్‌లో ఎదురులేని మొనగాడు.. రెండు సార్లు వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ చాంపియన్ జార్జ్ ఫొరెమాన్(George Foreman) కన్నుమూశాడు. అమెరికాకు చెందిన ఆయన 76 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. శుక్రవారం ఈ బాక్సింగ్ దిగ్గజం మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. అయితే.. జార్జ్ మరణించడానికి కారణం ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. బాక్సింగ్ రింగ్ నుంచి వైదొలిగాక జార్జ్.. క్రైస్తవ మత బోధకుడిగా కొన్నాళ్లు సేవలందించాడు. దాంతో, ఆయన మరణవార్త విని పలువురు కంటతడి పెడుతున్నారు.
“జార్జ్ ఫొరెమాన్ ఒక మంచి బోధకుడు, మంచి భర్త, పిల్లల్ని ఎంతగానో ప్రేమించే తండ్రి. ఆయన తన జీవితాన్ని చాలా గొప్పగా గడిపారు. లక్షలాది మంది అభిమానుల నమ్మకం చూరగొన్న ఆయన మానవతావాదిగానూ ప్రసిద్ధి. రెండు సార్లు హెవీ వెయిట్ చాంపియన్ అయిన జార్జ్.. మరణంతో మా హృదయం ముక్కలైంది” అంటూ కుటుంబసభ్యులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
అమెరికాలోని టెక్సాస్‌లో 1949లో జన్మించాడు జార్జ్. చిన్నప్పుడే బడి మానేసిన అతడు.. వీధుల్లో తన ఈడు పిల్లలతో పోట్లాడేవాడు. అల్లరచిల్లరగా తిరుగుతున్న అతడు యవ్వనంలో బాక్సింగ్ మీద దృష్టి సారించాడు. తొలి టైటిల్ వేటలో మహ్మద్ అలీ చేతిలో కంగుతిన్న జార్జ్ 19 ఏళ్లకు తన శక్తిని ప్రపంచానికి చాటాడు. తన పంచ్ వపవర్ చూపిస్తూ.. 1968లో జరిగిన ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలుపొందాడు. కెరియర్లో 76 మ్యాచుల్లో జార్జ్ విజేతగా నిలవగా.. వాటిలో ఏకంగా 68సార్లు నాకౌట్ చేయడం విశేషం. 28 ఏళ్లకే ఆటకు అల్విదా పలికి అందర్ని ఆశ్చర్యపరిచిన ఈ స్టార్ బాక్సర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నాడు కూడా.