మధిర( చింతకాని ), మార్చి 22 : ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడు, రేపల్లెవాడ గ్రామాల్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న, వరి పంటలను మధిర డివిజన్ వ్యవసాయ ఉపసంచాలకులు (ఏడిఏ ) స్వర్ణ విజయచంద్ర శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులు సాగు చేసిన పంటలకు ఏ మేరకు నీటి తడులు కావాలో అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ నెల చివరి నాటికి నాగార్జునసాగర్ జలాలు విడుదల చేస్తారన్నారు. రైతులు అవసరాల మేరకు మాత్రమే పంటలకు తడులు ఇవ్వాలన్నారు. యాసంగి సీజన్లో ఎక్కువగా యూరియా వాడకం జరిగిందన్నారు. వ్యవసాయ అధికారులు ఇచ్చిన సలహా మేరకు యూరియాను వినియోగించాలన్నారు. అనంతరం పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా చేస్తున్న ఫిజికల్ వెరిఫికేషన్‌ను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఓ మానస, ఏఈఓ తేజ, రైతులు పాల్గొన్నారు.