Bhaichung Bhutiya : ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య(AIFF)పై భారత లెజెండరీ ఫుట్‌బాలర్ బైచుంగ్ భూటియా(Bhaichung Bhutiya) విరుచుకుపడ్డాడు. ఈమధ్య కాలంలో భారత జట్టు చెత్త ప్రదర్శనకు కారణమైన ఫుట్‌బాల్ సమాఖ్య అధికారులపై అతడు విమర్శలు గుప్పించాడు. ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్‌లో ‘బ్లూ టైగర్స్’ మూడో రౌండ్లోనే ఇంటిదారి పట్టడంపై భూటియా అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అంతేకాదు భారత ఫుట్‌బాల్‌కు మునపటి వైభవం తేవాలంటే తక్షణమే సమాఖ్య ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని ఈ దిగ్గజ ఆటగాడు అభిప్రాయపడ్డాడు.
‘ఇది నిజంగా శుభ సంకేతం కాదు. గత కొన్ని రోజులుగా మన జట్టు పతన దశకు చేరుకుంది. ఒకదశలో 100 ర్యాంక్‌లోపు ఉన్న భారత జట్టు ఇప్పుడు 125కు పడిపోయింది. అందుకని ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్యలో కొత్త పాలక మండలి ఏర్పాటు అవసరం ఎంతో ఉంది. ఎన్నికలు జరిపి కొత్తవాళ్లను ఎన్నుకోవాలి’ అని భూటియా వెల్లడించాడు.
ఇక కాంటినెంటల్ కప్‌లో ఒక ప్రణాళిక అంటూ లేకపోవడం వల్లనే సిరియాపై 0-3తో ఓటమి పాలైందని, ఆపై మారిషస్ జుట్టుపై 0-0తో డ్రా చేసుకున్నామని ఈ సందర్భంగా భూటియా తెలిపాడు. ఈశాన్య రాష్ట్రానికి చెందిన భూటియా తన ముద్ర వేశాడు. అండర్ 23 జట్టు తరఫున అద్భుతంగా రాణించి జాతీయ జట్టులోకి వచ్చాడు. అనతికాలంలోనే కెప్టెన్‌గా ఎదిగి జట్టును గెలుపు తోవ తొక్కించాడు. 1995 నుంచి 2011 వరకూ ఇండియాకు ఆడిన భూటియా 84 గోల్స్ కొట్టాడు.
ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు ఓటమి తర్వాత అనూహ్య పరిణామాలు జరిగాయి. ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య హెడ్‌కోచ్ ఇగొర్ స్టిమాక్ (Igor Stimac)పై వేటు వేసింది. పదవీకాలం మధ్యలోనే అతడిని తొలగించింది. ఈమధ్యే మనొలో మర్కెజ్ను కొత్త హెడ్‌కోచ్‌గా నియమించింది. ప్రస్తుతం గోవా ఫుట్‌బల్ క్లబ్‌కు కోచ్‌గా ఉన్న మర్కెజ్ ఏకకాలంలో బ్లూ టైగర్స్‌కు కూడా సేవలందించనున్నాడు.
ఇగొర్ స్టిమాక్