BFI : పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ల బృందం తీవ్రంగా నిరాశపరిచింది. ఆరుగురిలో ఏ ఒక్కరు కూడా పతకం గెలవలేకపోయారు. దాంతో, భవిష్యత్ పోటీలను దృష్టిలో పెట్టుకొని భారత బాక్సింగ్ సమాఖ్య (BFI) కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ కోచ్‌లను నియమించేందుకు సిద్దమైంది. మంగళవారం బీఎఫ్ఏ విదేశీ కోచ్‌లను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.
‘భారత బాక్సింగ్ సమాఖ్య జాతీయ జట్టు కోసం విదేశీ కోచ్‌లను వెతుకుతోంది. ఎంపికైనవాళ్లు నాలుగేండ్ల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. లాస్ ఏంజెల్స్‌లో 2028లో జరుగబోయే ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు.. ఇతర పోటీల్లో భారత బాక్సర్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాలనేది మా ఉద్దేశం.
ఇక అర్హతల విషయానికొస్తే.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కోచింగ్ అనుభవం ఉన్నవాళ్లు, ఒలింపిక్ విజేతలను తయారుచేసినవాళ్లకు తొలి ప్రాధాన్యం ఇస్తాం’ అని బీఎఫ్ఏ తెలిపింది. ప్రస్తుతం కోచ్‌గా ఉన్న దిమిత్రి మిత్రుక్ రెండేండ్ల పాటు పదవిలో కొనసాగనున్నాడు.
ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బాక్సర్లు పతకంతో మెరవలేకపోయారు. టోక్యోలో కాంస్యం తెచ్చిన లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు) ఈసారి క్వార్టర్స్ దాటలేకపోయింది. తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ (50 కిలోలు) అనూహ్యంగా 16వ రౌండ్లోనే వెనుదిరిగింది. జైస్మినె లంబోరియా(57 కిలోలు), ప్రీతి పవార్(54 కిలోలు)లు కూడా సత్తా చాటలేదు.
ఇక పురుషుల విభాగంలో అమిత్ పంగల్(51 కేజీ) స్థాయికి తగ్గట్టు ఆడలేదు. యువకెరటం నిషాంత్ దేవ్(71 కిలోలు) క్వార్టర్స్ చేరినా మరో అడుగు వేయలేకపోయాడు. దాంతో, భారత బాక్సింగ్ సమాఖ్యకు నిరాశే మిగిలింది.