NMC Advisory | దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య కళాశాలలకు జాతీయ మెడికల్ కమిషన్ మంగళవారం అడ్వైజరీని జారీ చేసింది. కోల్‌కతా వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన నేపథ్యంలో మార్గదర్శకాలను జారీ చేసింది. తప్పనిసరిగా మార్గదర్శకాలను అమలు చేయాలంటూ.. అన్ని వైద్య కళాశాలల్లో సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించేందుకు ఈ అడ్వైజరీని జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల మేరకు అడ్వైజరీని జారీ చేసింది. ఇటీవలి కాలంలో వైద్య కళాశాలల్లో వైద్యులపై హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
కళాశాల, ఆసుపత్రి ప్రాంగణంలో అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లతో సహా సిబ్బందికి సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని సూచించింది. క్యాంపస్, రెసిడెన్షియల్ క్వార్టర్స్‌లోని ఓపీడీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టళ్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తగిన భద్రతా చర్యలు ఉండేలా చూడాలని చెప్పింది. అన్ని సున్నిత ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని చెప్పింది. ఓపీడీ, వార్డులు, క్యాజువాలిటీ, లేబర్ రూమ్, హాస్టల్స్, రెసిడెన్షియల్ క్వార్టర్స్, మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ప్రాంగణంలో ఇతర బహిరంగ ప్రదేశాలలో భద్రతా సిబ్బందిని మోహరించాలని.. ఇందులో మహిళా సిబ్బంది ఉండేలా చూడాలని చెప్పింది. అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించింది.
వైద్య విద్యార్థులపై హింసాత్మక సంఘటన జరిగిన వెంటనే కళాశాల యాజమాన్యం విచారణ చేసి.. పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పింది. సంఘటనకు సంబంధించిన వివరణాత్మక చర్యలకు సంబంధించిన నివేదికను సంఘటన జరిగిన 48 గంటల్లోగా ఎన్ఎంసీకి పంపాలని ఆదేశించింది. అంతకుముందు జేపీ నడ్డా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోల్‌కతాలో మహిళా డాక్టర్ హత్య చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో నడ్డాకు ఐఎంఏ లాఖ రాసింది. ఈ సందర్భంగా పలు డిమాండ్లు ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చింది.