England : టెస్టుల్లో బజ్‌బాల్ ఆటతో రెచ్చిపోయే ఇంగ్లండ్ బ్యాటర్లు వన్డేల్లోనూ దంచేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోస్తూ జట్టు స్కోర్ నాలుగొందలు దాటించారు. బౌండరీల మోత మోగించిన జాకబ్ బెథెల్(110), జో రూట్ (100), శతకాలతో భారీ స్కోర్‌కు పునాది వేయగా మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ (62 నాటౌట్) సైతం దంచేశాడు. దాంతో.. నిర్ణీత ఓవర్లలో ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 414 రన్స్ చేసింది. ఈ ఫార్మాట్లో ఆ జట్టు 400 ప్లస్ చేయడం ఇది ఏడోసారి. తద్వారా టీమిండియా రికార్డును సమం చేసింది ఇంగ్లీష్ టీమ్.
నామమత్రమైన మూడో వన్డేలో ఇంగ్లండ్ ఆటగాళ్లు జూలు విదిల్చారు. ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టుకు కొండంత స్కోర్ అందించారు. తొలుత ఓపెనర్ జేమీ స్మిత్(62) అర్ధ శతకంతో శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత జో రూట్(100), జాకబ్ బెథెల్ (110) ద్వయం విధ్వంసక ఆటతో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. పోటాపోటీగా బౌండరీలు బాదిన ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారిన బెథెల్‌ను మహరాజ్ ఔట్ చేసి బ్రేకిచ్చాడు.
How’s he done that then? 😂 pic.twitter.com/dKpDcCFI4x
— England Cricket (@englandcricket) September 7, 2025
కాసేపటికే కెప్టెన్ హ్యారీ బ్రూక్(3) రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పటికీ స్కోర్ మూడొందలు దాటింది. రూట్‌తో కలిసి విరుచుకుపడిన జోస్ బట్లర్(62 నాటౌట్)కు విల్ జాక్స్ (19 నాటౌట్) తోడవ్వగా ఇంగ్లండ్ స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. బర్గర్ వేసిన 50వ ఓవర్లో తొలి బంతిని జాక్స్ బౌండరీకి పంపడంతో స్కోర్ 400లకు చేరింది. అదే జోరులో అతడు మరో మూడు ఫోర్లు బాదగా ఆతిథ్య జట్టు ప్రత్యర్థికి 415 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
పురుషుల వన్డే క్రికెట్లో ఇప్పటవరకూ 30 సార్లు నాలుగొందలకు పైగా స్కోర్లు నమోదయ్యాయి. అత్యధికంగా దక్షిణాఫ్రికా 8 పర్యాయాలు 400 ప్లస్ స్కోర్లతో ప్రత్యర్థులకు దడ పుట్టించింది. భారత్, ఇంగ్లండ్ ఏడుసార్లు ఈ ఫీట్ సాధించగా.. ఆస్ట్రేలియా మూడు సార్లు, న్యూజిలాండ్, శ్రీలంక రెండు దఫాలు, జింబాబ్వే ఒకసారి నాలుగొందలు కొట్టాయి.