Ben Stokes : ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes) కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్ మినహా పెద్దగా ప్రభావం చూపని అతడు ఐపీఎల్ 2024లో ఆడకూడదని అనుకుంటున్నాడు. ఈ విషయాన్ని అతడు చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) ఫ్రాంఛైజీకి తెలియజేశాడు. అతడి నిర్ణయాన్ని సమర్ధిస్తామని చెన్నై యాజమాన్యం ఓ ప్రకటనలోతెలిపింది. ‘ఐపీఎల్‌కు ముందు భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్, ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఉంది. ఐపీఎల్ ఆడితే ఆ సిరీస్‌లో వర్క్‌లోడ్ పడుతుందని స్టోక్స్ భావిస్తే అతడికి మేము సహకరిస్తాం’ అని చెన్నై పేర్కొంది.
వరల్డ్ కప్ ముందు నుంచి స్టోక్స్ ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. మెగా టోర్నీ తర్వాత స్వదేశంలో సర్జరీ చేయించుకుంటానని ఈ స్టార్ బ్యాటర్ ఇంతకుముందే వెల్లడించిన విషయం తెలిసిందే. పైగా సిరీస్ ఉంది. జనవరి చివరి వారంలో స్టోక్స్ సర్జరీ చేయించుకోనున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభమయ్యే సమయానికి అతడు కోలుకుంటాడు. అయితే.. ఆలోపు ఫిట్నెస్ సాధిస్తాడా? లేదా? అనేది తెలియదు. దానికి తోడూ ఐపీఎల్లో శారీరంపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. అందుకనే స్టోక్స్ వచ్చే సీజన్లో ఆడకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా టెస్టులపైనే దృష్టి పెట్టిన స్టోక్స్ వచ్చ ఏడాది భారత్‌తో టెస్టు సిరీస్ కల్లా ఫిట్‌గా ఉండాలని భావిస్తున్నాడు.
2019 వరల్డ్ కప్‌లో స్టోక్స్ అద్భుతంగా రాణించాడు. కీలకమైన ఫైనల్లో స్టోక్స్ (83 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగి మోర్గాన్ సేన ఆశల్ని నిలబెట్టాడు. చివరి బంతివరకూ పోరాడి మ్యాచ్‌ను సూపర్ఓవర్కు తీసుకెళ్లాడు. దాంతో, ఇంగ్లండ్ తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది. దాంతో, 2022 ఐపీఎల్ వేలంలో స్టోక్స్ భారీ ధర పలికాడు. రూ.16.25 కోట్ల రికార్డు ధరకు చెన్నై అతడిని కొనుగోలు చేసింది. అయితే.. ఈ స్టార్ ప్లేయర్ తీవ్రంగా నిరాశపరిచాడు. 16వ సీజన్లో గాయం కారణంగా స్టోక్స్ చాలావరకూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.