England XI : అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో సిరీస్ విజయంపై కన్నేసిన ఇంగ్లండ్ (England)కు ఊహించని షాక్ తగిలింది. మాంచెస్టర్ టెస్టులో శతకంతో చెలరేగిన కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ఓవల్ టెస్టుకు దూరమయ్యాడు. భుజం గాయంతో బాధ పడుతున్న స్టోక్స్ నిర్ణయాత్మక టెస్టులో ఆడడం లేదని బుధవారం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వెల్లడించింది. అంతేకాదు ఓవల్ టెస్టుకు గతంలో సారథ్యం వహించిన అనుభవం ఉన్న ఓలీ పోప్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు సెలెక్టర్లు.
స్టోక్స్ దూరమవ్వడంతో తుది జట్టులో భారీ మార్పులు చేశారు సెలెక్టర్లు. మాంచెస్టర్‌లో ఆడిన పలువురికి ఓవల్ టెస్టులో చోటు దక్కలేదు. సీనియర్ పేసర్లు ఆర్చర్, బ్రైడన్ కార్సేతో పాటు ఎనిమిదేళ్ల తర్వాత తొలి మ్యాచ్ ఆడిన స్పిన్నర్ లియామ్ డాసన్‌ను కూడా పక్కన పెట్టేశారు. వీళ్ల స్థానంలో జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్ జోష్ టంగ్, జేమీ ఓవర్టన్‌లను ఎంపిక చేశారు. పేసర్లకు పెద్ద పీఠ వేయడం చూస్తుంటే ఓవల్‌లో బౌన్సీ ట్రాక్ సిద్దం చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
❌ Stokes is out!
❌ Dawson, Archer and Carse also miss out
✅ Bethell, Atkinson and Overton come in pic.twitter.com/isMsoS6veb— ESPNcricinfo (@ESPNcricinfo) July 30, 2025
ఇంగ్లండ్ తుది జట్టు : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్(కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్(జేమీ స్మిత్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్.
మాంచెస్టర్లోనే సిరీస్ కైవసం చేసుకోవాలనుకున్న ఇంగ్లండ్‌కు భంగపాటు ఎదురైంది. భారత ఆటగాళ్లు గిల్, రాహుల్, జడేజా, సుందర్‌ల అద్బుత పోరాటంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దాంతో, అక్కడ చేజారిన విజయాన్ని ఓవల్‌లో సాధించాలనే కసితో ఉన్న ఆతిథ్య జట్టుకు స్టోక్స్ గాయం నిజంగా శరాఘాతమే.
ఆర్చర్, అట్కిన్సన్
మాంచెస్టర్ టెస్టులో నాలుగో రోజు రాహుల్ వికెట్ తీసిన స్టోక్స్ ఆ తర్వాత ఇబ్బంది పడుతూనే బౌలింగ్ చేశాడు. టీ తర్వాత అతడు అసలు బౌలింగ్‌కే రాలేదు. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 143 ఓవర్లు బ్యాటింగ్ చేయగా.. ఇంగ్లండ్ సారథి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 35 ఓవర్లు వేశాడు. అందువల్లే స్టోక్స్ గాయం తీవ్రత పెరిగి ఉంటుందని వైద్యులు తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్.. ఈరెండింటా ఫామ్‌లో ఉన్న కెప్టెన్ స్టోక్స్ గాయంతో దూరమవ్వడం ఇంగ్లండ్‌కు పెద్ద ఎదురుదెబ్బ.