BCCI | ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసి విజేతగా నిలిచిన భారత జట్టుకు ట్రోఫీ అందజేత విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న మోహ్సిన్ నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై బీసీసీఐ మరోసారి తీవ్రంగా స్పందించింది. ట్రోఫీని అందజేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఇప్పటికే హెచ్చరించిన బీసీసీఐ.. తాజాగా ఇదే విషయమై నఖ్వీకి అధికారిక ఈ-మెయిల్ కూడా పంపించింది. ట్రోఫీని అప్పగించాలని లేదంటే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించినట్టు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ తెలిపారు. ట్రోఫీ అందజేత విషయంలో తాము దశలవారీగా ముందుకెళ్తున్నామని ఆయన అన్నారు. నఖ్వీ స్పందన కోసం ఎదురుచూస్తున్నామని.. ఒకవేళ ఆయన తన పద్ధతిని మార్చుకోకుంటే ఐసీసీకీ అధికారికంగా ఈ-మెయిల్ ద్వారా విషయాన్ని తెలియజేస్తామని అన్నారు. వచ్చే నెలలో జరగాల్సి ఉన్న ఐసీసీ మీటింగ్‌లోనూ దీనిని లేవనెత్తుతామని చెప్పారు.
బీసీసీఐ ఈ-మెయిల్‌ను ఏసీసీ ప్రతినిధి ఒకరు ధృవీకరించారు. ‘గతవారం బీసీసీఐ సెక్రటరీ, బీసీసీఐ ఏసీసీ ప్రతినిధి రాజీవ్ శుక్లాతో పాటు శ్రీలంక, అఫ్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డుల ప్రతినిధులు భారత్‌కు ట్రోఫీని అందజేయాలని నఖ్వీకి మెయిల్ చేశారు’ అని తెలిపాడు. అయితే ఈ విషయంలో నఖ్వీ మాత్రం మొండిపట్టును వీడటం లేదు. బీసీసీఐ నుంచి ప్రతినిధి ఎవరైనా వచ్చి తన చేతులమీదుగా ట్రోఫీని తీసుకుపోవాలని ఇప్పటికే చెప్పిన ఆయన.. అదే స్టాండ్‌ను కొనసాగిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలో ఉంది.