BCCI : వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఆడుతుందా? లేదా? అనే విషయమై ఉత్కంఠ కొనసాగుతోంది. పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి జట్టును పంపడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సిద్ధంగా లేదు. భద్రతా కారణాల రీత్యా దాయాది దేశానికి జట్టును పంపడం తమకు సుతారము ఇష్టంలేదని బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah) ఇప్పటికే స్పష్టం చేశాడు. తాజాగా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా(Rajeev Shukla) సైతం అదే అభిప్రాయం వెలిబుచ్చాడు. ప్రభత్వం అనుమతిస్తేనే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడుతుందని ఆయన చెప్పాడు.
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య కాన్పూర్‌లో రెండో టెస్టు జరుగుతుండగా.. రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడుతుందా? అనే ప్రశ్న ఎదురైంది. అందుకు.. చాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపాలా? వద్దా? అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
అయితే.. మా నియమాల ప్రకారం అంతర్జాతీయ పర్యటనల కోసం ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. భారత జట్టు ఏ దేశానికైనా వెళ్లాలా? వద్దా? అనేది ప్రభుత్వ ఇష్టం. ఈ విషయంలో మేమే చేయగిలిగేది ఏమీ ఉండదు. ప్రభుత్వ ఆదేశాలను పాటించడమే మా విధి అని శుక్లా తెలిపాడు.
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి దాదాపు 11 ఏండ్లు కావొస్తోంది. ఆ తర్వాత ఇరు జట్లు అంతర్జాతీయ వేదికల మీదనే తలపడనున్నాయి. దాంతో.. ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్, టీ20 ప్రపంచ కప్‌లలో మాత్రమే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌లు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. నిరుడు ఆసియా కప్ హక్కులు దక్కించుకున్న పాకిస్థాన్‌కు బీసీసీఐ ఝలక్ ఇచ్చింది. హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తే తప్ప టీమిండియా ఆడదని సెక్రటరీ జై షా తేల్చి చెప్పాడు. దెబ్బకు దిగొచ్చిన ఐసీసీ.. చివరకు భారత జట్టు మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చింది.
🚨Champions Trophy Draft submitted by the PCB.India vs Pakistan match on march 1 in Lahore, Waiting for the BCCI’s approval.🚨 pic.twitter.com/QSkIr5NJUI
— Sujeet Suman (@sujeetsuman1991) July 3, 2024
కానీ.. వన్డే వరల్డ్ కప్ టోర్నీకి పీసీబీ భారత్‌కు తమ జట్టును పంపింది. దాంతో.. ఈసారి చాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా వెళ్లక తప్పని పరిస్థితి. అయినా సరే.. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తేనే భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఆడుతుందని పీసీబీకి షా స్పష్టం చేశాడు. ఈ విషయమై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ().. షాల మధ్య పరోక్షంగా మాటల యుద్దం నడిచింది. టీమిండియాను పాక్‌కు పంపడాన్ని నిరాకరిస్తూ భారత ప్రభుత్వం ఇచ్చిన లేఖ చూపాలని బీసీసీఐని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.