IPL Pre-Fitness Camp | క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేసే ఐపీఎల్ 2022 టోర్నీ మరో 20 రోజుల్లో మొదలు కానున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కని ప్లేయర్లతోపాటు మొత్తం 25 మంది క్రికెటర్లకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో క్యాంప్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ టోర్నమెంట్ మొదలవ్వడానికి 10 రోజుల ముందు ఫిట్నెస్ క్యాంప్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందని ఎన్సీఏ అధికారులు అంటున్నారు.
ఈ ఫిట్నెస్ క్యాంప్‌లో తమతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న, ఒప్పందం చేసుకోని క్రికెటర్లకు కూడా బీసీసీఐ చోటు కల్పించనున్నది. ఈ క్యాంప్‌లో శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ తదితరులు పాల్గొననున్నారు.
ఇప్పటికే కొందరు క్రికెటర్లు బెంగళూరులోని ఎన్సీఏకు చేరుకున్నారు. మిగతా వారు రంజీ ట్రోఫీ ఆఖరి రౌండ్ పోటీలు ముగిశాక చేరుకుంటారని బీసీసీఐ పేర్కొంది. కేఎల్ రాహుల్ ఎన్సీఏలో ఎక్సర్సైజ్ విన్యాసాల ఫొటోలను సోఫల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశాడు. గాయంతో శ్రీలంకతో తొలి టెస్ట్‌కు దూరమైన అక్షర్ పటేల్ ఫిట్‌గా ఉన్నాడని, 13 నుంచి జరిగే రెండో టెస్ట్కల్లా జట్టుకు అందుబాటులో ఉంటాడని పేర్కొంది.