BCCI : ఐదు రోజుల వ్యవధిలో సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నారు. భారత జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించిన ఈ స్టార్ ద్వయం ఇంగ్లండ్ సిరీస్‌కు ముందు బీసీసీఐకి ఊహించని షాకిస్తూ రిటైర్మెంట్ ప్రకటిచారు. దాంతో, వాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ (Central Contract) కొనసాగింపుపై సందేహాలు తలెత్తాయి. నిరుడు టీ20లకు, తాజగా టెస్టులకు అల్విదా చెప్పిన ఈ ఇద్దరికి బీసీసీఐ షాక్ ఇస్తుందనే కథనాలు వినిపించాయి. అయితే.. టీమిండియా దిగ్గజాలైన రోకో కాంట్రాక్టు రద్దు చేయడం లేదని బీసీసీఐ తెలిపింది.
ప్రస్తుతం ఏ ప్లస్ విభాగంలో ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఇంతకు ముందులానే అన్ని ప్రయోజనాలు సమకూరుస్తామని సెక్రటరీ దేవజిత్ సైకియా (Devajit Saikia) వెల్లడించాడు. ‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టీ20లు, టెస్టులు వీడ్కోలు పలికినప్పటికీ ఏ ప్లస్ కాంట్రాక్ట్ వర్తిస్తుంది. వన్డేల్లో మాత్రమే కొనసాగే వీళ్లు ఇప్పటికీ టీమిండియా జట్టులో సభ్యులే. కాబట్టి.. విరాట్, హిట్‌మ్యాన్‌లు ఏ గ్రేడ్ కాంట్రాక్ట్‌తో పాటు ఇతర సౌకర్యాలను అనుభవిస్తారు’ అని సైకియా చెప్పుకొచ్చాడు.
దేవజిత్ సైకియా
ప్రతిఏటా బీసీఐ వార్షిక కాంట్రాక్టులను ప్రకటిస్తుంది. మామూలుగా అయితే.. మూడు ఫార్మాట్లలో ఆడే వాళ్లను ఏ ప్లస్ విభాగంలోకి తీసుకుంటారు. సీనియారిటీ, ప్రతిభను కూడా పరిగణనించి గ్రేడ్స్ కేటాయిస్తారు. కొన్నాళ్లుగా విరాట్, రోహిత్‌లు ఏ ప్లస్ కేటగిరీలోనే ఉండేవారు. అయితే.. నిరుడు టీ20లకు వీడ్కోలు పలికినా 2024-25కు మళ్లీ ఇద్దరికీ ఏ ప్లస్ కాంట్రాక్ట్ దక్కింది. కానీ, ఇప్పుడు టెస్టులకు సైతం రోహిత్, కోహ్లీ గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మార్పులు తథ్యమనే వార్తలు వినిపించాయి. కానీ, బీసీసీఐ మాత్రం అలాంటి వదంతులకు చెక్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఇద్దరితో పాటు పేసర్ జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఏ ప్లస్ విభాగంలో ఉన్నారు. వీళ్లకు బీసీసీఐ ఏటా రూ. 7 కోట్లు చెల్లించనుంది.
టీమిండియాను టెస్టుల్లో నంబర్ 1గా నిలిపిన కోహ్లీ ఆ తర్వాత ఆటగాడిగానూ విశేష సేవలందించాడు. 123 టెస్టులు ఆడిన విరాట్ 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. అందులో 30 శతకాలు ఉన్నాయి. ఇక రోహిత్ 67 టెస్టుల్లో 40.57 సగటుతో 4,301 రన్స్ కొట్టాడు. అతడి ఖాతాలో 12 సెంచరీలు ఉన్నాయంతే.