ముంబై: అటవీ ప్రాంతంపై పట్టు కోసం రెండు పులుల మధ్య ఫైట్ జరిగింది. ఈ పోరాటంలో ఒక పులి మరణించింది. మరో పులి గాయపడింది. (One tiger killed, another injured in fight) అటవీ శాఖ అధికారులు ఈ విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్నారు. మరణించిన పులికి నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తడోబా అంధారి టైగర్ రిజర్వ్‌లోని రామ్‌దేగి అడవుల్లో నివసించే పులుల జంట చోటా మట్కా, నయనతార అభయారణ్యానికి వచ్చే సందర్శకులకు తరచుగా కనిపిస్తుంటాయి.
కాగా, మంగళవారం చోటా మట్కా, మరో పులి బ్రహ్మ మధ్య ఫైట్ జరిగింది. ఈ పోరాటంలో బ్రహ్మ మరణించగా చోటా మట్కా గాయపడింది. ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఫైట్‌లో మరణించిన బ్రహ్మ పులికి నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు చోటా మట్కా, నయనతార నివసించే అటవీ ప్రాంతం స్వాధీనం కోసం బ్రహ్మ, వీరభద్ర పులులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చోటా మట్కాపై బ్రహ్మ దాడి చేసిందని చెప్పారు. ఈ రెండు పులుల మధ్య ఫైట్‌లో బ్రహ్మ మరణించగా, చోటా మట్కా స్వల్పంగా గాయపడిందని వెల్లడించారు. అటవీ విస్తీర్ణం తగ్గి ఆవాసాలు కోల్పోవడం వల్ల పులులు ప్రాదేశిక పోరాటాలకు పాల్పడతాయని వివరించారు. ఇది ఆందోళనకర పరిణామమని అన్నారు.