Yo Yo Test | టీమిండియా వరుస సిరీస్‌లలో ఓటమి చవిచూసింది. మరీ ముఖ్యంగా హెడ్‌కోచ్‌గా గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రదర్శన ఏమాత్రం బాగా లేదు. ఆటగాళ్ల పేలవమైన ఫామ్ కారణంగా వరుస సిరీస్‌లలో పరాజయం పాలైంది. ఈ క్రమంలో బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగిన సమయంలో అమలులో ఉన్న పాత ఫిట్నెస్ టెస్ట్ రూల్స్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తుందని సమాచారం. అయితే, ఆటగాళ్లపై పనిభారం, ప్రయాణాన్ని పరిగణలోకి తీసుకొని బోర్డు గతంలో అమలులో ఉన్న యో-యె ఫిట్నెస్ టెస్ట్‌ను రద్దు చేసింది.
ఈ తాజాగా ఈ విధానాన్ని మళ్లీ తీసుకురావాలని యోచిస్తున్నట్లుగా బీసీసీ వర్గాలు తెలిపాయి. కఠినమైన ఫిట్నెస్ టెస్ట్‌తో ఆటగాళ్లు ఇబ్బందులుపడుతున్నారనే కారణంతో యో యో టెస్ట్‌ను బీసీసీఐ పక్కన పెట్టింది. తాజాగా ఐదైనా సిరీస్ కోసం జట్టును ప్రకటించే సమయంలో తప్పనిసరిగా ఫిట్నెస్ను పరిశీలించేందుకు యో యో టెస్ట్ నిర్వహించాలని వైద్యబృందం నుంచి సూచించినట్లుగా సమాచారం. దాంతో బీసీసీఐ యో యో టెస్ట్‌ను తప్పనిసరి చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. క్రికెటర్లు బిజీ షెడ్యూల్‌తో ఇబ్బందులుపడుతున్న నేపథ్యంలో ఫెట్నెస్ టెస్ట్‌పై బీసీసీఐ ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చింది.
తాజాగా ఆటగాళ్ల ఫామ్ లేమితో పాటు తరుచూ ఆటగాళ్లు గాయాలకు గురవుతుండడం ఇబ్బందికరంగా మారుతున్నది. ఈ క్రమంలో మళ్లీ బీసీసీఐ కఠినమైన యో యో టెస్ట్‌ను తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల వరుస సిరీస్‌లలో టీమిండియా ఓటమిపాలైన నేపథ్యంలో బీసీసీఐ తప్పనిసరిగా ఆటగాళ్లు అందరూ దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి తీసుకున్న ఆటగాళ్లు తప్ప.. మిగతా వారంతా తప్పనిసరిగా దేశవాళీలో ఆడాల్సిందే. మరో వైపు జట్టు పని విధానంలో బీసీసీఐ పలు మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తున్నది.