ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి కొత్త తరహా కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెటర్లతో కుదుర్చుకునే ఆ ఒప్పందంలో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఏ ప్లస్ కేటగిరీని ఎత్తివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ కొత్త తరహా కాంట్రాక్టు మోడల్‌కు ఆమోదం దక్కితే .. టీమిండియా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు భారీ నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఆ ఇద్దరు సీనియర్లను ఇక నుంచి గ్రేడ్ బీ కేటగిరీలో పొందుపరిచే అవకాశాలు ఉన్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కొత్త తరహా సెంట్రల్ కాంట్రాక్టు విధానాన్ని అజిత్ అగార్కర్ నేతృత్వంలో రూపొందించినట్లు తెలుస్తోంది. ఏ ప్లస్ కేటగిరీని రద్దు చేయాలని ఆ కమిటీ సూచించినట్లు స్పష్టం అవుతున్నది. ఆ కేటగిరీలో కాంట్రాక్టు కింద ఏడు కోట్లు ఇస్తారు. అయితే కొత్త ప్లాన్‌లో కేవలం మూడు కేటగిరీలను మాత్రమే ఉంచనున్నారు. ఏ, బీ, సీ మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ కొత్త మోడల్‌కు బీసీసీఐ ఆమోదం చెబుతుందా లేదా అన్న విషయం తెలిసిందే.
ఇక కొత్త మోడల్ వల్ల కోహ్లీ, రోహిత్ పేమెంట్‌లో 57 శాతం కోత ఉండే అవకాశం ఉన్నది. ఈ ఇద్దరూ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న కారణంగా వాళ్లు ఏ కేటగిరీలో ఉండే అవకాశం లేదని అర్థమవుతోంది. ఆ సీనియర్ క్రికెటర్లు ఇక బీ కేటగిరీలో ఉండనున్నారు.బీ కేటగిరీలో కేవలం మూడు కోట్లు మాత్రమే పేమెంట్ ఇస్తారు. దీని వల్ల వాళ్లు వార్షికంగా నాలుగు కోట్లు కోల్పోనున్నారు.