ముంబై: భారత క్రికెట్ జట్టుకు టైటిల్ స్పాన్సర్షిప్ వేటను బీసీసీఐ మొదలుపెట్టింది. ఇటీవలే పార్లమెంట్లో ఆమోదం పొందిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025’తో ‘డ్రీమ్ 11’ సంస్థ అర్థాంతరంగా టీమ్ఇండియా టైటిల్ స్పాన్సర్ నుంచి వైదొలిగిన నేపథ్యంలో బీసీసీఐ కొత్త స్పాన్సర్‌ను వెతుక్కునే పనిలో పడింది. గతానుభవాల దృష్ట్యా బీసీసీఐ ఈసారి బిడ్డింగ్‌లో పాల్గొనే సంస్థలకు స్పష్టమైన లక్ష్మణ రేఖ గీసింది.
ఆన్లైన్ మనీ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌తో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఎలాంటి సేవలనూ అందిస్తున్న సంస్థలైనా బిడ్ దాఖలు చేసేందుకు అనర్హులని తేల్చి చెప్పింది. అంతేగాక క్రిప్టో కరెన్సీ, నిషేధిత ఉత్పత్తుల బ్రాండ్లు, పొగాకు, ఆల్కహాల్, బీసీసీఐ బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థలకూ నో చెప్పింది.
బిడ్ వేసే సంస్థల వార్షిక టర్నోవర్ కనిష్టంగా రూ. 300 కోట్లు ఉండాలని బీసీసీఐ పేర్కొంది. బిడ్ దాఖలు చేసేందుకు చివరి తేదీని ఈనెల 16గా నిర్ణయించింది. ఇదిలాఉండగా బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో ఉన్న నేపథ్యంలో ఈనెల 9 నుంచి యూఏఈ వేదికగా మొదలుకాబోయే ఆసియా కప్‌లో సూర్యకుమార్ నేతృత్వంలోని భారత జట్టు టైటిల్ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగనుంది.