BCCI | ముంబై: దేశంలో మహిళా క్రికెట్ అభ్యున్నతిపై దృష్టి సారించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆ దిశగా మరో ముందడుగు వేసింది. ఇక నుంచి దేశవాళీ క్రికెట్లో ఆడే మహిళలు, జూనియర్ స్థాయి పోటీలలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ విజేతలకు నగదు బహుమానం అందజేయనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.
జై షా వారసుడిగా జైట్లీ?
ఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా త్వరలోనే ఐసీసీ చైర్మన్ రేసులోకి వెళ్లనుండటంతో అతడి స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి కోసం బోర్డు వేట మొదలుపెట్టిందా? ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడు, బీజేపీ దివంగత నాయకుడు అరుణ్ జైట్లీ కుమారుడు అయిన రోహన్ జైట్లీ.. జై షా వారసుడిగా ఎంపిక కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సెక్రటరీ పదవికి రాష్ర్టాల అసోసియేషన్ల నుంచి పలువురి పేరు వినిపించినా జై షా తో పాటు బోర్డు రోహన్ వైపునకే మొగ్గుచూపుతున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక ఐసీసీ చైర్మన్ రేసులో ఉన్న జై షాకు బోర్డులో 16 మందికి గాను 15 మంది సభ్యుల మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అతడు చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం.