ముంబై: యూకే, శ్రీలంక పర్యటనల్లో టీమిండియా ప్రదర్శన, కీలక ఆటగాళ్ల గాయాల నిర్వహణ, రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌పై చర్చించేందుకు బీసీసీఐ గురువారం సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగే ఈ భేటీకి హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ సీఓఈ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌తో పాటు టెస్టు, వన్డే సారథి శుభ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ గిల్ హాజరుకానున్నారు.
అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్ పర్యటన, వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని కీలక ఆటగాళ్లయిన బుమ్రా, హార్దిక్, ఆకాష్ దీప్, సుందర్, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా గాయాల నిర్వహణలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనితీరుపై సైకియా, గంభీర్, అగార్కర్ ఆరా తీయనున్నారు. వాళ్లు ఎప్పటిలోపు తిరిగి బరిలోకి దిగుతారో స్పష్టత కోరే చాన్సుంది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ చేతిలో భారత్ టీ20 సిరీస్‌ల్లో చిత్తవడంపై బోర్డు వివరణ కోరనుంది. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉంటాడా లేదా? అనే అంశంపైనా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగొచ్చు. అగార్కర్ కాంట్రాక్ట్ గడువు పొడిగింపు, టీమిండియా సెటప్లోలక్ష్మణ్కు మరింత కీలక బాధ్యతలు అప్పగించే అంశాన్ని కూడా పరిశీలించే చాన్సుంది.