దుబాయ్ : ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. ట్రోఫీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ సొంతం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం దుబాయ్లో వాడీవేడిగా జరిగిన ఏసీసీ ఏజీఎంలో ట్రోఫీపైనే ప్రధానంగా చర్చ జరిగింది. బీసీసీఐ తరఫున ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, మాజీ కోశాధికారి ఆశిష్ షెలార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా టీమ్ఇండియాకు ట్రోఫీ అందజేయకపోవడంతో పాటు బహుమతి ప్రదానోత్సవంలో నఖ్వీ వ్యవహరించిన తీరుపై శుక్లా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారని బోర్డు వర్గాలు తెలిపాయి. ‘ఫైనల్లో గెలిచిన జట్టుకు ట్రోఫీని అందజేయాలి. అది ఏసీసీ ట్రోఫీ. ఎవరి వ్యక్తిగతం కాదు’ అని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం.
అయితే ట్రోఫీని అందించేందుకు నఖ్వీ సుముఖంగా లేనట్టు తెలుస్తున్నది. భారత జట్టు తనను అవమానించిందని, తన చేతులమీదుగా ట్రోఫీని అందుకోకూడదనే విషయం తనకు తెలియదని ఆయన వాపోయినట్టు వినికిడి. దీనిపై బీసీసీఐ తనకు ఈమెయిల్ గానీ, ముందస్తు సమాచారం గానీ ఇవ్వలేదని ఆయన చెప్పినట్టు ఏసీసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇదిలాఉండగా టీమ్ఇండియాకు ట్రోఫీ అందజేసే విషయంపై ఏసీసీ.. ఆసియాలోని ఐదు టెస్టు సభ్యత్వం కల్గిన (భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్గానిస్థాన్) బోర్డులకు నిర్ణయాన్ని వదిలేసినట్టు సమాచారం.