Gautam Gambhir | భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది. ఐదు మ్యాచుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆతిథ్య జట్టుతో తలపడుతున్నది. ఇప్పటికే సిరీస్‌లో టీమిండియా 1-2 తేడాతో వెనుకంజలో ఉన్నది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు పలువురు సీనియర్ ఆటగాళ్లు ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఆటతీరుపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహంతో ఉన్నాడు. టీమిండియా ప్రదర్శన విషయంలో హెడ్‌కోచ్ గంభీర్‌పై బీసీసీఐ సైతం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తున్నది. హెడ్‌కోచ్‌కు చాంపియన్స్ ట్రోఫీ వరకు అవకాశం ఇచ్చినట్లు ఓ మీడియా నివేదిక పేర్కొంది. టీమిండియా ప్రదర్శన మెరుగుపడక పోతే గంభీర్‌పై చర్యలకు ఉపక్రమించే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది.
బీసీసీఐ చెందిన ఓ అధికారి జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఓ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో ఆడాల్సి ఉంది. జట్టు ప్రదర్శన మెరుగుపడకపోతే గంభీర్ స్థానం సైతం సురక్షితం కాదు’ అంటూ సదరు అధికారి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్లో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాక్‌తో పాటు యూఏఈ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఐసీసీ ఇటీవల టోర్నీ షెడ్యూల్‌ని సైతం విడుదల చేసింది. టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుండగా.. మార్చి 9న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలో ఎనిమిది జట్లు పాల్గొనుండగా.. 15 మ్యాచులు ఆడతాయి. భారత జట్టు గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ దుబాయిలోనే జరుగుతాయి. మిగతా జట్ల మ్యాచులన్నీ పాక్‌లోనే జరుగుతాయి. ఈ టోర్నీ 19 రోజుల పాటు కొనసాగుతుంది.
గతేడాది జూలైలో గంభీర్ భారత జట్టు హెడ్‌కోచ్‌గా నియామకమయ్యాడు. అప్పటి నుంచి టీమిండియా తొమ్మిది టెస్టులు ఆడింది. ఇందులో టీమిండియా ఐదు మ్యాచులు ఓడి.. మూడింట గెలిచింది. ఇందులో ఒక మ్యాచ్ డ్రా అయ్యింది. దీంతో పాటు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా భారత్ ఓటమి పాలైంది. గంభీర్ కంటే ముందు రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రి కోచ్‌లుగా పని చేసిన సమయంలో మంచి కమ్యూనికేషన్ ఉండేదని మీడియా నివేదిక పేర్కొంది. అయితే, ప్రస్తుతం జట్టులో ఉన్న చాలామంది ఆటగాళ్లు గంభీర్ నిర్ణయాలతో ఏకీభవించడం లేదని తెలుస్తున్నది. రోహిత్ శర్మ విషయంలోనూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. హిట్‌మ్యాన్ ఓ ఆటగాడిని ఎంపిక చేసినా.. పక్కన పెట్టినా అతన్ని ఎందుకు తీసుకుంటున్నాం.. ఎందుకు పక్కన పెడుతున్నామనే విషయంలో సదరు క్రికెటర్లతో వ్యక్తిగతంగా మాట్లాడుతానని చెప్పాడు. అయితే, రోహిత్ ఇటీవల మాట్లాడడం మానేసినట్లుగా సమాచారం.
ఛాంపియన్స్ ట్రోఫీ వరకు జట్టు ప్రదర్శన మెరుగుపడకపోతే గంభీర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. హెడ్‌కోచ్‌గా గంభీర్ బీసీసీఐ ఫస్ట్ ఛాయిస్ కాదని ఆ అధికారి తెలిపారు. హెడ్‌కోచ్‌గా మాజీ దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించాలని బీసీసీఐ ఆసక్తితో ఉందని.. గంభీర్ విషయంలో కేవలం ‘రాజీ’ పడిందని సదరు అధికారి పేర్కొన్నారు. మూడు ఫార్మాలకు కలిపి టీమిండియా హెడ్‌కోచ్‌గా విదేశీయులను సైతం తీసుకునే విషయంలో బీసీసీఐ ఇష్టపడడం లేదని.. కొన్ని బలవంత పరిస్థితులతోనే హెడ్‌కోచ్ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.