ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కాసుల పంట పండుతున్నది. ప్రపంచంలోనే ధనిక బోర్డుగా వర్ధిల్లుతున్న బీసీసీఐ మరోమారు తన సత్తా ఏంటో చూపెట్టింది. 2023-24 వార్షిక సంవత్సరానికి గాను బీసీసీఐ ఏకంగా రూ. 9741.7 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో ఐపీఎల్‌దే అగ్రభాగం కావడం విశేషం. అత్యంత ప్రజాదరణ పొందిన ఐపీఎల్‌తో బోర్డుకు రికార్డు స్థాయిలో రూ. 5761 కోట్లు వచ్చాయి.
బోర్డు మొత్తం ఆదాయంలో ఇది 59 శాతంగా నమోదు అయ్యిందని ప్రముఖ బ్రాండింగ్ సంస్థ రెడిప్యుజన్ తమ నివేదికలో పేర్కొంది. దీనికి తోడు ఐపీఎల్ కాకుండా మిగతా అంతర్జాతీయ మ్యాచ్‌లు, సిరీస్‌ల్లో మీడియా హక్కుల ద్వారా రూ. 361 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదిలా ఉంటే ఐపీఎల్ ద్వారా కోట్లు కొల్లగొడుతున్న బీసీసీఐ ఆదాయ నిల్వలు రూ. 30వేల కోట్లకు చేరుకున్నాయి.