BCCI-Dream11| టీమిండియా స్పాన్సర్షిప్ నుంచి డ్రీమ్11 తప్పుకుంది. బీసీసీఐతో జరిగిన రూ.358కోట్ల ఒప్పందం నుంచి గడువుకు ముందు అర్ధాంతరంగా డ్రీమ్11 రద్దు చేసుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ‘ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఒప్పందం నుంచి వైదొలగాలని ఫాంటరీ స్పోర్ట్స్ కంపెనీ నిర్ణయించుకుంది. బీసీసీఐతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2025 ఆమోదం నేపథ్యంలో ఒప్పందం ముగిసిందన్నారు. భవిష్యత్‌లో ఆ సంస్థతో బీసీసీఐకి ఒప్పందం ఉండదన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల డ్రీమ్ 11 ప్రతినిధులు బీసీసీఐ కార్యాలయానికి చేరుకొని టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా ఇకపై కొనసాగలేమని సీఈవో హేమంగ్ అమీన్ అధికారికంగా బీసీసీఐకి వెల్లడించారు.
ఒప్పందం రద్దయిన నేపథ్యంలో రాబోయే ఆసియా కప్‌లో భారత జట్టు డ్రీమ్ 11 లోగో లేకుండానే మైదానంలోకి దిగబోతున్నది. బీసీసీఐ త్వరలోనే కొత్త స్పాన్సర్ కోసం టెండర్ జారీ చేసే అవకాశం ఉంది. బైజు స్థానంలో 2023లో బీసీసీఐ స్పాన్సర్ హక్కులను డ్రీమ్ 11 సొంతం చేసుకుంది. ఈ స్పాన్సర్ ఒప్పందం విలువను రూ..358 కోట్లుగా నిర్ణయించారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ ఒప్పందం నుంచి వైదొలిగింది. ఈ నిర్ణయం భారతదేశంలో క్రికెట్ నియంత్రణ మండలిపై మాత్రమే కాకుండా క్రీడా ప్రపంచంపై ప్రభావం కనిపించనున్నది. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు స్పాన్సర్‌గా ఉంది. డ్రీమ్ 11కు పలువురు క్రికెటర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఇందులో మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి అగ్ర క్రికెటర్లు ఈ జాబితాలో ఉన్నారు. 2020లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతల సమయంలో వీవో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను వదులుకున్న సమయంలో డ్రీమ్11 కొంతకాలం టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. తాజాగా డ్రీమ్11 అకస్మాత్తుగా స్పాన్సర్షిప్ నుంచి తప్పుకోవడం బీసీసీఐకి ఇబ్బందికరంగా మారింది. కొత్త స్పాన్సర్‌ను వెతికిపట్టుకోవడం సవాల్‌గా మారింది. అయితే, దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్‌లు, ఆటగాళ్లపై కనిపించనున్నది.
ఆసియా కప్ ఈ ఏడాది సెప్టెంబర్ రెండోవారం చివరలో మొదలుకానున్నది. దాంతో బీసీసీఐకి స్పాన్సర్స్‌ను తక్కువ సమయంలో వెతకాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆటగాళ్ల జెర్సీలపై లోగో కనిపించదు. ఇది బ్రాండ్ విలువ, ఆదాయం రెండింటిని ప్రభావితం చేయనున్నది. 2020లో వివో వైదొలిగిన తర్వాత డ్రీమ్-11 ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్‌గా వ్యవహరించిన సమయంలో ఇదే పరిస్థితి నెలకొంది. డ్రీమ్ 11 ఈ కంపెనీ అనేక ఐపీఎల్ ఫ్రాంచైజీలకు, అనేక మంది స్టార్ ఆటగాళ్లకు స్పాన్సర్‌గా ఉంది. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) భాగస్వామి. అదే సమయంలో న్యూజిలాండ్ దేశీయ లీగ్ ‘సూపర్ స్మాష్’ టైటిల్ స్పాన్సర్ కూడా. ఈ చిన్న టోర్నమెంట్లకు ఐపీఎల్ తరహాలో బలమైన ఆర్థిక మద్దతు లేదు. ఈ క్రమంలో డ్రీమ్11 ఒప్పందాలను రద్దు చేసుకున్న నేపథ్యంలో ఆయా జట్లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే అవకాశాలున్నాయి.