అండర్-19 ప్రపంచకప్ గానీ మరేదైనా జూనియర్ స్థాయి క్రికెట్ టోర్నీలు ముగిసిన తర్వాత వచ్చే ప్రధానమైన ఆరోపణలు ఆటగాళ్ల వయసు మీదే.. తప్పుడు దృవ పత్రాలను సమర్పించి టోర్నీలో పాల్గొన్నాడని తరుచూ వార్తలు చూస్తూనే ఉంటాం. ఈ తరహా మోసాలను మొగ్గలోనే తుంచివేయడానికి బీసీసీఐ నడుం కట్టింది. క్రికెటర్ల వాస్తవ వయసును కచ్చితంగా అంచనా వేయగలిగే సాధనాన్ని ఇకనుంచి వాడనుంది.
ప్రస్తుతం యువ క్రికెటర్ల వయసును కొలిచేందుకు గాను బీసీసీఐ TW3 విధానాన్ని వాడుతున్నది. దీని ప్రకారం.. ఎడమచేతి మణికట్టును ఎక్స్‌రే తీయడం ద్వారా వయసును నిర్ధారించడం. దీనికి ఖర్చు రూ. 2,400 (ఒక్కొక్కరికి) వరకు అవుతున్నది. రిపోర్ట్ కోసం మూడు నుంచి నాలుగు రోజులు ఆగాల్సిందే. కానీ బీసీసీఐ వాడనున్న BoneXpert Software ద్వారా క్షణాల్లోనే వయసును నిర్ధారించవచ్చు. అంతేగాక దీనికయ్యే ఖర్చు రూ. 288 మాత్రమే. అంటే TW3తో కంటే కొత్త ప్రక్రియ ద్వారా బీసీసీఐకి 80 శాతం ఖర్చు తగ్గుతుంది.
ఇన్నాళ్లు వయసు నిర్ధారణ ఇలా..
క్రికెటర్ల వయసును నిర్దారించేందుకు గాను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు ముందుగా తమ ఆధ్వర్యంలో నడిచే ఎక్స్‌రే సెంటర్లలో బీసీసీఐకి చెందిన అధికారి సమక్షంలో పరీక్షలు జరిపి వాటిని ముంబైలో ఉన్న బీసీసీఐ ఏవీపీ డిపార్ట్మెంట్కు పంపిస్తాయి. ఏవీపీ విభాగం దానిని ఇద్దరు రేడియాలజిస్టులతో కూడిన బృందాని (ఒక్కోసారి నలుగురు)కి పంపుతుంది. రేడియాలజిస్టులు ఆ శాంపిల్స్‌ను పరీక్ష చేసి నాలుగు రోజుల తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు.
వివిధ అసోసియేషిన్ల నుంచి పంపిన శాంపిల్స్ అన్నీ పరీక్షించి ఫలితాలు వెల్లడించేసరికి కనీసం రెండు నెలల సమయమైనా పడుతుంది. కాలంతో పాటు ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో బీసీసీఐకి ఇది ‘భారం’గా మారుతున్నదని బోర్డు పెద్దలు భావిస్తున్నారు. కానీ కొత్త విధానంతో ఈ ప్రక్రియకు చెక్ పడనుంది.
గతంలో అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొన్న పలువురు క్రికెటర్లు తమ వయసును తక్కువగా చూపించి జాతీయ జట్టుకు ఆడారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 2019 జూన్‌లో జమ్మూకాశ్మీర్ ఆటగాడు రసిక్ ఆలం, ఐపీఎల్లో కేకేఆర్, ఢిల్లీ తరఫున ఆడిన మనోజ్ కర్ల, అంకిత్ బావ్నేతో పాటు ఈ ఏడాది ప్రారంభంలో ముగిసిన అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొన్న రాజవర్ధన్ హంగర్గేకర్‌పై కూడా ఇవే తరహా ఆరోపణలు వచ్చాయి. మరి బీసీసీఐ తీసుకొస్తున్న ఈ అధునాతన వ్యవస్థతో మోసాలు ఏ మేరకు తగ్గుతాయనేది వేచి చూడాల్సిందే.