మేడిపల్లి, జూన్ 7 : కుటుంబ ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీలో రసూల్ జాకబ్ (33) తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రసూల్‌కు 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనతో వివాహమైంది. కొన్ని రోజులు ఇద్దరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత మేఘన తన భర్త రసూల్ జాకబ్‌పై వరకట్నం కేసు పెట్టి, తల్లి గారి ఇంటికి వెళ్లిపోయింది. విడాకుల కేసు కోర్టులో ఉంది. ఆర్థిక ఇబ్బందులు పడుతూ మానసికంగా బాధపడుతున్న అతడు తన బెడ్ రూంలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూసే సరికి అప్పటికే అతడు మృతి చెందాడు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కీసర, జూన్ 7; ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర మానసిక ఒత్తిడితో ఓ వ్యక్తి జీవితంపై విరక్తి చెంది ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కీసర సీఐ ఆర్కేపల్లి ఆంజనేయులు కథనం ప్రకారం.. కీసర పోలీస్‌స్టేషన్ పరిధి రాంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఆరిగే రాములు కుమారుడు అరిగే అశోక్ (38) వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వేసవి సెలవులు కావడంతో అతని భార్య తన పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. స్నేహితులతో కలిసి ఐదు రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లి శుక్రవారం ఇంటికొచ్చాడు.
రాత్రి ఇంట్లో పడుకున్న అశోక్ తెల్లారేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకొని కన్పించాడు. అతని తల్లిడండ్రులు ఫోన్ చేసినా డోర్ తీయకపోవడంతో డోర్‌ను పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకొని కన్పించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, గదిలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ’నేను తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాను, అమ్మానాన్న నన్ను క్షమించండి. నా భార్య పిల్లలు, చెల్లెలిని బాగా చూసుకోండి’ అంటూ రాసి పెట్టి మృతి చెందాడు. ఆర్థికంగా బాగానే ఉన్న అశోక్ ఈ విధంగా ఎందుకు చేశాడో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించిన కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బాలానగర్, జూన్ 7 : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నర్సింహరాజు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ఐడీపీఎల్కాలనీలోని శివాలయంలో పూజారిగా పని చేస్తున్న కొండూరి కిషోర్ శర్మ (42) భార్యతో ఏర్పడిన విభేదాల కారణంగా మనస్థాపం చెంది ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎనిమిదేళ్ల క్రితం పిఠాపురంకు చెందిన మళ్లీశ్వరీదేవిని ప్రేమించి కొండూరి కిషోర్ శర్మ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు సంతానం కలుగలేదు. గత కొంతకాలంగా దంపతుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే మూడు నెలల క్రితం మళ్లీశ్వరీదేవి పుట్టింటికి వెల్లిపోయింది. భార్యను పుట్టింటి నుంచి తీసుకురావడానికి కిషోర్ శర్మ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కిషోర్ శర్మ మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ దావఖానకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.