ఢిల్లీ: మరో రెండు రోజుల్లో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్-18లో పలు జట్లకు విదేశీ ఆటగాళ్ల రాకపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఫ్రాంచైజీలకు స్వల్ప ఊరటనిచ్చింది. అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసుకోవడానికి గాను టెంపరరీ రిప్లేస్మెంట్స్కు ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఆయా జట్లు ఫారెన్ ప్లేయర్స్ స్థానాన్ని తక్షణమే మరో ప్లేయర్‌తో భర్తీ చేసుకోవచ్చు. దీని ప్రకారమే ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ సీజన్‌కు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ స్థానంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే ఈ రిప్లేస్మెంట్స్ మాత్రం తాత్కాలికం. వచ్చే ఏడాది జరుగబోయే ఐపీఎల్ మినీ వేలంలో ఈ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి ఆ జట్లకు అవకాశం లేదు. వీళ్లు మినీ వేలంలో పాల్గొనవచ్చునని ఐపీఎల్ సీవోవో హేమంగ్ అమిన్ ఫ్రాంచైజీలకు సూచించాడు.
స్వదేశాలకు వెళ్లినవారిలో ఎవరు తిరిగొస్తారు? అన్నదానిపై ఆందోళనపడ్డ ఫ్రాంచైజీలు.. ఆస్ట్రేలియాకు చెందిన పలువురు (స్టార్క్, హాజిల్‌వుడ్) మినహా మిగిలిన దేశాల ఆటగాళ్లంతా తిరిగి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఊపిరి పీల్చుకున్నాయి. బుధవారం పలువురు విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీలతో చేరగా శుక్ర, శనివారం నాటికి మిగిలినవారూ ఆయా జట్లతో కలిసే అవకాశముంది. అయితే ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు మాత్రం లీగ్ దశ ముగియగానే మళ్లీ బ్యాగులు సర్దుకోనున్నారు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ ప్లేయర్లు, ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్లేఆఫ్స్‌కు అందుబాటులో ఉండబోమని ఫ్రాంచైజీలకు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఆయా దేశాల బోర్డులు సైతం ఈ షరతు మీదే వారిని తిరిగి భారత్‌కు పంపేందుకు అంగీకరించాయి. మే 26న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, మే 27న ఇంగ్లండ్ క్రికెటర్లు మళ్లీ స్వదేశం బాట పట్టనున్నట్టు తెలుస్తున్నది. ఈ ప్రభావం గుజరాత్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ జట్లపై అధికంగా పడనుంది.
తాజా సీజన్ పునరుద్ధరణ ప్రకటన తర్వాత బుధవారం నాటికి పలు జట్లు అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్స్‌ను తిరిగి ప్రారంభించాయి. గుజరాత్ టైటాన్స్ మంగళవారం నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టగా బుధవారం పంజాబ్, లక్నో, ముంబై ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చారు. చెన్నై ఆటగాళ్లు కూడా చెపాక్‌కు చేరుకుంటున్న విషయాన్ని ఆ జట్టు ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సైతం బుధవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నాడు.