ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ శనివారం కీలక భేటీ కాబోతున్నది. ఐపీఎల్లో గెలిచిన జట్లు నిర్వహించే విజయోత్సవ ర్యాలీలకు పాటించాల్సిన మార్గదర్శకాలు, కొత్త నియమ నిబంధనలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు బోర్డు వర్గాల సమాచారం.
ఇటీవలే ఐపీఎల్లో తొలి ట్రోఫీ నెగ్గిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నిర్వహించతలపెట్టిన విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో బీసీసీఐ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది. ఈ మీటింగ్‌ను వర్చువల్‌గా నిర్వహించనున్నట్టు సమాచారం.
తొక్కిసలాట ఘటనలో అరస్టైన ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసలెకు కర్నాటక హైకోర్టు గురువారం బెయిల్ మంజూరుచేసింది. జూన్ 6న కర్నాటక పోలీసులు.. నిఖిల్‌తో పాటు డీఎన్ఎ ఎంటర్టైన్మెంట్స్కు చెందిన ఇద్దరు ప్రతినిధులను అదుపులోకి తీసుకున్న విషయం విదితమే.