BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జై షా(Jai Shah) అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) చైర్మన్గా ఎంపికవ్వడంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అనే ప్రశ్న మొదలైంది. ఏకగ్రీవంగా షా ఐసీసీ చీఫ్గా ఎంపికై వారం గడుస్తున్నా నూతన కార్యదర్శి ఎవరన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో బీసీసీఐ వార్షిక సమావేశం తేదీ వచ్చేసింది. బెంగళూరు వేదికగా 93వ జనరల్ మీటింగ్ సెప్టెంబర్ 29న జరుగనుంది. ఈ సమావేశంలో జై షా వారసుడి ఎంపిక ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, బీసీసీఐ వర్గాలు మాత్రం అదేం లేదంటున్నాయి. దాంతో, సమావేశంలో ఏమేం చర్చిస్తారు? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
బీసీసీఐ సెక్రటరీగా జై షా స్థానంలో పగ్గాలు చేపట్టేది ఎవరు? అనేది ఇంకా కొలిక్కి రాలేదు. దాంతో, బెంగళూరులోని ఫోర్ సీజన్స్ హోటల్లో సెప్టెంబర్ 29న జరుగబోయే సమావేశంపైనే అందరి కండ్లు నిలిచాయి. కొత్త కార్యదర్శి ఎంపికకు ఎన్నికలు ఉంటాయా? అని వస్తున్న ప్రశ్నకు బీసీసీఐ అధికారు ఒకరు చెక్ పెట్టారు. ఎన్నికల ద్వారా కొత్త సెక్రటరీ నియామకం జరుగదని తేల్చేశాడు. అంతేకాదు తమ దృష్టంతా 18 అంశాలపైనే ఉందని అన్నాడు.
ఈ సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని(Roger Binni)ని ఐసీసీలో ఇకపై బీసీసీఐ తరఫున ప్రతినిధిగా ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం. ఐపీఎల్లో బీసీసీఐ ప్రతినిధిగా ఒకరిని ఎంపిక చేయడం, వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు అంబుడ్స్మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.
ఇక జై షా స్థానంలో సెక్రటరీ కాబోతున్నాడనే వార్తల్ని ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ (Rohan Jaitley) ఖండించాడు. బీసీసీఐ కాబోయే కొత్త కార్యదర్శి అంటూ తనపై వస్తున్న వార్తలపై పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. బీసీసీఐ సెక్రటరీ రేసులో తాను లేనని, అవన్నీ గాలి వార్తలని ఆయన కొట్టిపారేశాడు.
రోహన్ జైట్లీ
దాంతో, ‘ఇదేంటీ..? రోహన్ జైట్లీ ఇలా షాకిచ్చాడు’ అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రోహన్ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడు. ఈ ఏడాది డిసెంబర్ 1న జై షా ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆలోపు బీసీసీఐ కొత్త సెక్రటరీ నియామకం జరిగే అవకాశముంది.