అమరావతి : ఏపీలో బుడమేరు(Budameru) గండ్లను పూడ్చేందుకు ఆర్మీ (Army) కూడా రంగంలోకి దిగుతోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్(Union Minister Shivraj Singh) వెల్లడించారు. ఏపీలోని విజయవాడలో భారీ వర్షాలు, వరద కారణంగా కేంద్రం ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. గురువారం రాత్రి ఏపీ సీఎంతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృంధాలను, హెలికాప్టర్లను పంపిందని గుర్తు చేశారు. గత ఐదు రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు 24 గంటలు పనిచేస్తున్నారని ప్రశంసించారు. బాధితులకు ఆహారం, పాలు, పండ్లు, బిస్కెట్లను డ్రోన్ల ద్వారా అందజేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో లక్షా 80 వేల హెక్టార్ల నష్టం జరిగిందని అన్నారు.
పశు, పంట నష్టం, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయని, గృహాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఫసల్ యోజన బీమా యోజన పథకం కింద సహాయం అందజేస్తామన్నారు. ప్రభుత్వ కృషి వల్లే ప్రాణనష్టం తగ్గిందన్నారు. ఏపీలో జరిగిన నష్టాన్ని గుర్తించేందుకు కేంద్ర బృందం పర్యటిస్తుందని తెలిపారు. విపత్తు నుంచి ప్రజలను అన్ని విధాలుగా కాపాడుతామని పేర్కొన్నారు.