రాయ్‌పూర్ : స్వదేశంలో ఈనెల 9 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు గాను వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా రీఎంట్రీ ఇచ్చారు. ఈ మేరకు సీనియర్ మెన్స్ సెలక్షన్ కమిటీ.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మందితో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగా మెడనొప్పితో రెండో టెస్టుతో పాటు వన్డేలకూ దూరమైన గిల్.. సిరీస్‌కు ఎంపికైనా అతడు ఆడేందుకు సీవోఈ నుంచి పూర్తిస్థాయి క్లీయరెన్స్ లభిస్తేనే ఆడే అవకాశముంటుందని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది.
ఇక ఆసియా కప్ ఫైనల్లో గాయపడి రెండునెలల పాటు ఆటకు దూరంగా ఉన్న హార్ధిక్ సైతం ఇటీవలే పూర్తిస్థాయిలో కోలుకుని సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో తన ఫిట్నెస్ను చాటుకున్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడిన జట్టులో రెండు మార్పులతో జట్టును ప్రకటించారు. ఆ సిరీస్‌లో సభ్యులుగా ఉన్న ఫినిషర్ రింకూ సింగ్‌తో పాటు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి జట్టులో చోటు దక్కలేదు. డిసెంబర్ 9న కటక్ వేదికగా మొదలుకాబోయే టీ20 సిరీస్.. 19న ముగియనుంది.
భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్,కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్.