ముంబై : భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాదంతా క్రికెట్ పండుగే. శనివారం నుంచి ఐపీఎల్ ఆరంభమవ్వాల్సి ఉండగా అది ముగిసిన (జూన్‌లో) తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లతోనూ ఏడాదంతా క్రికెట్ సందడి పంచడానికి బీసీసీఐ షెడ్యూల్ సిద్ధం చేసింది. వచ్చే సెప్టెంబర్ నుంచి మొదలుకాబోయే 2026-27 సీజన్లో టీమ్ఇండియా స్వదేశంలో 5 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లతో అలరించనుంది. ఈ మేరకు బోర్డు 2026-27 హోం సీజన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జనవరి-మార్చి మధ్య జరుగబోయే ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో ఐదు టెస్టుల (నాగ్‌పూర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్)కు గాను ఈశాన్య రాష్ట్రమైన అసోంలోని బర్సపుర స్టేడియం (గువాహటి) ఆతిథ్యమివ్వనుండటం గమనార్హం. ఈ మైదానం నిరుడు భారత్, దక్షిణాఫ్రికా టెస్టుకు ఆతిథ్యమిచ్చినా మరో మ్యాచ్‌ను దక్కించుకోవడం గమనార్హం.
ఇక టెస్టులకు ఆతిథ్యం దక్కకపోయినా హైదరాబాద్ అభిమానులు ఈ బిజీ షెడ్యూల్లో ఒక టీ20 (వెస్టిండీస్‌తో), ఒక వన్డే (జింబాబ్వేతో) మ్యాచ్ చూసే అవకాశం లభించింది. వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా వన్డేలకు ఎక్కువ ప్రాధాన్యమున్న నేపథ్యంలో మొదట వెస్టిండీస్‌తో సెప్టెంబర్‌లో మూడు వన్డేలు, డిసెంబర్లో శ్రీలంకతో మూడు, జనవరిలో జింబాబ్వేతో మూడు వన్డేలు జరుగుతాయి. 2002 తర్వాత జింబాబ్వే జట్టు భారత్‌లో పర్యటించనుండటం ఇదే మొదటిసారి. వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహత్, కోహ్లీ ద్వయం అభిమానులకు ఇది శుభవార్తే.