IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తదుపరి మ్యాచ్‌లకు అన్ని జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ప్లే ఆఫ్స్ లక్ష్యంగా వ్యూహాలకు పదను పెడుతున్నాయి. మరోవైపు విదేశీ క్రికెటర్లను రప్పించేందుకు ఆయా బోర్డులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒత్తిడి పెంచుతోంది. అయినా సరే.. కొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరం అయ్యే అవకాశముంది. కీలకమైన విదేశీ ప్లేయర్ల కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీలకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. అందుబాటులో ఉన్నవాళ్లను తీసుకోండి అని బంపర్ ఆఫర్ ఇచ్చింది.
అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బీసీసీఐ అదే పని చేస్తోంది. ఐపీఎల్ వాయిదా పడడంతో స్వదేశం చేరుకున్న విదేశీ క్రికెటర్లలో కొందరు తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నారు. దాంతో, వాళ్లపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫ్రాంచైజీలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అసలే ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠ రేపుతున్న వేళ.. వాళ్లకు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కోవాలని బీసీసీఐ సూచిస్తోంది.
‘ఐపీఎల్ 18వ ఎడిషన్ మిగతా మ్యాచ్‌లకు కొందరు విదేశీ ఆటగాళ్లు దూరం కానున్నారు. వ్యక్తిగత కారణాలు, అనారోగ్యం లేదా గాయాలు వెంటాడడంతో వాళ్లు టోర్నీలో ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో తాత్కాలిక క్రికెటర్లను తీసుకోవాలని బీసీసీఐ చెబుతోంది. దాంతో, ఈ నిర్ణయం పలు ఫ్రాంచైజీల పాలిట వరంగా మారనుంది అని ఐపీఎల్ సీఓఓ హేమంగ్ వెల్లడించాడు. అంతేకాదు.. ప్రస్తుతం తాత్కాలికంగా స్క్వాడ్‌లోకి వచ్చే క్రికెటర్లు 19వ సీజన్ మినీ వేలంలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది’ అని హేమంగ్ అమిన్ (Hemang Amin) చెప్పాడు.
🚨 NEWS 🚨@DelhiCapitals sign Mustafizur Rahman as replacement for Jake Fraser-McGurk.
Details 🔽 #TATAIPLhttps://t.co/qWeCJ56QpJ
— IndianPremierLeague (@IPL) May 14, 2025
క్రికెట్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా బోర్డులు ఆటగాళ్లను పంపేందుకు అభ్యంతరం తెలపడం లేదు. అయితే.. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఉన్నందున ఇరుజట్లకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓపెనర్ ఫ్రేజర్ మెక్ గుర్క్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman)ను తీసుకుంది. ఢిల్లీ తరహాలోనే విదేశీ క్రికెటర్ల స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్ మే 17 నుంచి పునః ప్రారంభం కానుంది. జూన్ 3న అహ్మదాబాద్ వేదికగా జరిగే టైటిల్ పోరుతో విజేత ఎవరో తేలిపోనుంది.