శాలిగౌరారం, మే 14 : స్వాతంత్ర్య అమరవీరుల త్యాగాలు భావితరాలకు తెలిసేలా వారి స్మారక స్థూపాల నిర్మాణం చేపడుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తెలిపారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో 1948లో జాతీయ జెండా ఎగురవేశారనే నెపంతో పలువురిని రజాకార్లతో కాల్చి చంపినట్లు చెప్పారు. వారి జ్ఞాపకాలకు గుర్తుగా స్థూపాల నిర్మాణానికి బుధవారం హనుమంతరావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. స్వాతంత్ర్య అమరవీరుల దేశ భక్తి నేటి తరానికి తెలిసేలా వారి స్మారకాలను తన సొంత ఖర్చులతో నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.