T20 World Cup 2024 : బంగ్లాదేశ్‌లో చెలరేగుతున్న హింస ప్రపంచ క్రికెట్‌పై పడనుంది. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా (Shaikh Hasina) రాజీనామాతో సైన్యం దేశాన్ని గుప్పిట్లోకి తీసుకుంది. బంగ్లాలో ఎప్పుడు సాధారణ రోజులు వస్తాయో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో మరో రెండు నెలల్లో జరగాల్సిన మహిళల టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2024)పై అనిశ్చితి నెలకొంది.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) అక్కడి ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. ఒకవేళ హింసాత్మక ఘటనలు ఇంకొన్ని రోజులు కొనసాగితే బంగ్లా నుంచి వరల్డ్ కప్ వేదికను తరలించే అవశాశముంది.
‘బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB)తో కలిసి ఐసీసీ ఆ దేశంలోని పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది. బీసీబీ భద్రతాధికారులతో పాటు మా స్వతంత్ర సిబ్బంది సైతం పరిస్థితిని ఆరా తీస్తోంది. మెగా టోర్నీలో పాల్గొనే క్రికెటర్ల భద్రతే మా ప్రధాన ఉద్దేశం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మహిళల టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో సీజన్ బంగ్లాదేశ్‌లో అక్టోబర్ 3న షురూ కానుంది. ఒకవేళ బంగ్లాలో ఈ మెగా నిర్వహించడం సాధ్యంకాని పక్షంలో ఐసీసీ కొత్త వేదికను ప్రటించనుంది.