INDW vs BANW : తొలి రెండు మ్యాచ్‌ల్లో తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన భారత మహిళల జట్టు మూటో టీ20లో ఓటమి పాలైంది. నామమాత్రమైన మూడో మ్యాచ్‌లో ఆతిథ్య బంగ్లాదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. షమీమ సుల్తానా (42) అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో బంగ్లా హ్యాట్రిక్ ఓటమి తప్పించుకుంది. దాంతో, హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) సేన క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. చివరకు 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 102 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (40; 3 ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్ కాగా.. జెమీమా రోడ్రిగ్స్ (28) పర్వాలేదనిపించింది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా.. షఫాలీ వర్మ (11), యష్తిక భాటియా (12) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. బంగ్లా బౌలర్లలో రాబియా ఖాన్ 3, సుల్తానా ఖాతూన్ రెండు వికెట్లు పడగొట్టారు.
హర్మన్‌ప్రీత్ కౌర్(40)
అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. ఓపెనర్ షమీమా సుల్తానా (42) టాప్ స్కోరర్‌గా నిలిచింది. టార్గెట్ పెద్దది కాకపోయినా.. భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. ఆతిథ్య జట్టుపై ఒత్తిడి కొనసాగించి క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ.. పోటీలో నిలిచారు. అయితే సాధించాల్సిన పరుగులు ఎక్కువ లేకపోవడంతో పాటు.. ఒక ఎండ్‌లో వికెట్లు పడతున్నా షమీమా ఒంటరి పోరాటం చేసి ఆ జట్టును గెలిపించింది. భారత బౌలర్లలో మిన్ను మని, దేవిక వైద్య చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 94 పరుగులు చేసిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచింది. వన్డే సిరీస్‌కు ముందు ఈ విజయం బంగ్లాకు పెద్ద ఊరట అనే చెప్పాలి. మూడు వన్డేల సిరీస్ ఇదే స్టేడియంలో జూలై 16న ప్రారంభం కానుంది.